Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబుని వైఎస్‌ జగన్‌ ఫాలో అవుతున్నారా.!

'చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ..' అంటాడు ఓ తెలుగు సినిమాలో కామెడీ విలన్‌. అది సినిమా.! టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అయితే, 'శంకుస్థాపన చెయ్యాలి మళ్ళీ మళ్ళీ.. ప్రారంభోత్సవాలు జరగాలి మళ్ళీ మళ్ళీ.. భూమి పూజ చెయ్యాలి మళ్ళీ మళ్ళీ..' అంటుంటారు. అనడమేంటీ, ప్రతీదీ ఒకటికి పదిసార్లు చేస్తేనేగానీ ఆయనకి తృప్తి వుండదు. పబ్లిసిటీ రావాలి కదా.! 

రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కార్‌ ఎన్నిసార్లు శంకుస్థాపనలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! చంద్రబాబు 'మళ్ళీ మళ్ళీ' సరదా పుణ్యమా అని ప్రజాధనం దుర్వినియోగమయ్యింది. అలా చంద్రబాబు చేస్తోన్న దుబారాపై అప్పట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దుమ్మెత్తిపోసింది కూడా. కానీ, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా, చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నట్టున్నారు. 

విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. జగన్‌ లేకుండానే ఈ ప్రారంభోత్సవ 'తంతు' ముగించేశారు పార్టీ ముఖ్య నేతలు. 'ఈ రోజు మంచి ముహూర్తం కాబట్టి' అంటూ, తూతూ మంత్రం ప్రారంభోత్సవం చేసేశారట. కొద్ది రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఇంకోసారి ప్రారంభోత్సవం జరుగుతుందట. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఇది పూర్తిగా వైఎస్సార్సీపీకి సంబంధించిన విషయం. ఒకసారి కాకపోతే, వందసార్లు పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసుకోవచ్చుగాక. ఇక్కడ వృధా అయ్యేది పార్టీకి సంబంధించిన డబ్బు మాత్రమే. కానీ, చంద్రబాబుని విమర్శించీ విమర్శించీ.. ఆయనగారి సెంటిమెంట్‌ని వైఎస్‌ జగన్‌ వంటబట్టించేసుకున్నారా.? అన్న డౌట్‌ మాత్రం ఎలివేట్‌ అవుతోందిప్పుడు.!