Home > Politics - Gossip
ఆశ్చర్యపడొద్దు.. ఆయనా బీజేపీలోకి చేరనున్నాడట!

పెద్దగా ఆశ్చర్య పోవడానికి ఏమీలేదు.. భారతీయ జనతా పార్టీ తీరును చూస్తుంటే.. ఈయననూ చేర్చుకోవడానికి వెనుకాడేలా లేదు. అనైతిక, అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యులైన వారికి భారతీయ జనతాపార్టీ చేదోడువాదోడుగా ఉండటం ఇప్పుడు జరుగుతున్నదే. కాంగ్రెస్ అవినీతిపై దుమ్మెత్తిపోస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా కాంగ్రెస్ అలవాట్లను తను చేసుకుని, కాంగ్రెస్ తీరును తను అలవాటు చేసుకుని ముందుకుపోతోంది. అలాగే కాంగ్రెస్ వ్యక్తులు కూడా బీజేపీకి క్రమక్రమంగా దగ్గరవుతున్నారు.

ఇప్పటికే న్యాచురలీ కరప్టెడ్ పార్టీ ఎన్సీపీకి బీజేపీకి దూరం చాలా వరకూ తగ్గింది. అది ఎంత వరకూ వెళ్లిందంటే ఎన్సీపీ అధినేతకు పద్మవిభూషణ్ ఇచ్చేంత వరకూ! ఎవరైతే మోడీ చేత సహజమైన అవినీతి పరుడిగా బిరుదును అందుకున్నారో.. అదే వ్యక్తికే మోడీ ప్రభుత్వం పద్మవిభూషణ బిరుదును ఇచ్చి సత్కరించింది. పరిస్థితి చూస్తుంటే.. ఈ పరంపర కొనసాగేలా ఉంది.

ఇప్పుడు టాక్ ఏమిటంటే... తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత చిదంబరం కమలంపార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు అనేది. యూపీ ఎన్నికల అనంతరం.. దక్షిణాదిన బలపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని.. ప్రత్యేకించి అందుకు తమిళనాడులో వ్యాక్యూమ్ ఉందని భావిస్తున్న కమలంపార్టీ.. అక్కడ చేరికలకు  ప్రాధాన్యతను ఇవ్వాలని భావిస్తోందట. అందులో భాగంగా జాతీయ స్థాయిలో పేరున్న కొందరు తమిళ నేతలను చేరదీయాలని అనుకుంటోందట. ఈ జాబితాలో ది గ్రేట్ చిదంబరం ఉన్నారని సమాచారం.

మరి చిదంబరాన్ని బీజేపీ ఎన్ని మాటలు అంది? ఆయన అవినీతి గురించి కమలనాథులు ఎన్ని ఆరోపణలు చేశారు.. కార్తీ చిదంబరంపై ఎన్ని కేసులు వేశారు.. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి.. అనే ప్రశ్నలేవీ మనం అడగకూడదు, వాళ్లు చెప్పకూడదు. శంఖులో పోస్తే తీర్థం అవుతుంది, బీజేపీ చూపు పడితే నీతిమంతులు అవుతారు. అదీ లెక్క. దాని ప్రకారమే చిద్దూ త్వరలోనే కమలంపార్టీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుందట. మరి చిద్దూ చేరికతో నిజాయితీ పరులైన కొంతమంది కమలం అభిమానుల గుండెలు పగిలితే పగలొచ్చు. దాని వల్ల కమలం పార్టీ హై కమాండ్ కు నష్టం ఏమీలేదు. ఇప్పుడు ఆ పార్టీ టార్గెట్ కేవలం సీట్లు, అధికారం మాత్రమే. దాని కోసం చిదంబరాన్ని చేర్చుకోవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు! చూసేవాళ్లకే.. ఇదంతా విడ్డూరం.