Home > Politics - Gossip
డ్యామిట్‌.. బీజేపీ కథ అడ్డం తిరిగింది

భారతీయ జనతా పార్టీకి దిమ్మ తిరిగే షాక్‌. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి, బీజేపీ అగ్రనేతలైన ఎల్‌కె అద్వానీ సహా, పలువురు బీజేపీ సీనియర్‌ నేతలపై కేసుల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ, ఉమాభారతి.. ఇప్పుడీ సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. 

ఉమాభారతి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.. రాష్ట్రపతి పదవి కోసం మురళీ మనోహర్‌ జోషీ ఎదురుచూస్తున్నారు. అద్వానీ సంగతి సరే సరి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే గవర్నర్‌ పదవిలో వున్నందున, కొన్నాళ్ళపాటు కేసుల నుంచి కళ్యాణ్‌సింగ్‌కి కొన్నాళ్ళపాటు వెసులుబాటు దక్కనుంది. లఖ్‌నవూ కోర్టులో ఈ కేసుకి సంబంధించి రోజువారీ విచారణ జరగనుండడం మరో విశేషం. 

దాదాపు రెండు దశాబ్దాల క్రితం బాబ్రీ మసీదుని 'కరసేవకులు' కూల్చివేసిన విషయం విదితమే. బీజేపీ నేతల ప్రసంగాలతో రెచ్చిపోయిన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారని పేర్కొంటూ, దానికి సంబంధించిన సాక్ష్యాధారాల్ని సీబీఐ, న్యాయస్థానం ముందుంచింది. గతంలో, ఈ కేసులో పైన చెప్పుకున్న నేతలంతా ఊరట పొందారు. అయితే, ఇప్పుడు కేసుల పునరుద్ధరణతో బీజేపీలో తీవ్రమైన కుదుపు వచ్చినట్లుగానే భావించాలి. 

రామజన్మభూమి వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా వున్నదే. అక్కడ మొదట రామమందిరం వుందనీ, దాన్ని కూల్చేసి మసీదు కట్టారన్నది ఓ వాదన. అసలు రామజన్మభూమి అనడానికి ఆధారాలే లేవన్నది ఇంకో వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా, బీజేపీకి సంబంధించినంతవరకు రామజన్మభూమి అనేది అల్టిమేట్‌ పొలిటికల్‌ ఎజెండా. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో 'మేం గెలిస్తే రామజన్మభూమిలో రామాలయం నిర్మిస్తాం..' అంటూ నినదించారు బీజేపీ నేతలు. 

ఇప్పుడేమో, కేసు ఇలా తిరగబడింది. ఓ పక్క వివాదాస్పద స్థలం (రామజన్మ భూమి - బాబ్రీమసీదు కూల్చివేత ప్రాంతం)కి సంబంధించి చర్చల ద్వారా సమస్య పరిష్కారం వెతకాలంటూ ఈ మధ్యనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరోపక్క, బాబ్రీ మసీదు కూల్చివేత వివాదంలో బీజేపీ నేతలకు సర్వోన్నత న్యాయస్థానం సూపర్‌ షాక్‌ ఇచ్చింది. ఇప్పుడిక రామజన్మభూమి అంశం, బాబ్రీ మసీదు అంశంపై బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ ఎలా వుండబోతోందో వేచి చూడాల్సిందే.