Home > Politics - Gossip
దత్తత గ్రామం పట్టని బాబు!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు విశాఖ జిల్లా ఏజెన్సీలోని అరకు నియోజకవర్గం ఎంచుకున్నారు. అక్కడ పెదలబుడు అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కూడా ఆర్భాటంగా ప్రకటించారు. అయితే మూడేళ్ల కాలంలో బాబు ఏనాడు ఆ వైపుగా పోలేదు.

ఏ కారణం చేతనో తరచూ ఆయన దత్తత గ్రామానికి వస్తాననడం, ఆ వెనువెంటనే అధికారులు హడావుడి చేయడం, చివరికి ఆ పర్యటన రద్దు కావడం జరిగిపోతోంది. తాజాగా మరోమారు అదే పునరావృత్తమైంది. ఈ నెల రెండవ వారంలో బాబు దత్తత గ్రామం సందర్శించాల్సి ఉరది.

కలెక్టర్‌ కూడా అక్కడికి వెళ్లి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి వచ్చారు. తీరా చివరి నిముషంలో బాబు పర్యటన రద్దు కావడంతో ఏజెన్సీ వాసులు, మరీ ముఖ్యంగా, దత్తత గ్రామస్తులు నిరాశలో నిండా మునిగారు.

తమ గ్రామానికి బాబు వచ్చి ఏవైనా వరాలు ఇస్తారని ఆశించిన వారికి రిక్త హస్తమే మిగిలింది. ఏజెన్సీలో ఇటీవల విష జ్వరాలతో పాటు, అనేక అనారోగ్యకరమైన పరిస్థితులు, సమస్యలు ఉన్నాయి. వాటిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారని భావించారు.

ఇదిలా ఉండగా బాబు పర్యటన రద్దు కావడం వెనుక ఇంటలిజెన్స్‌ వర్గాలు అందించిన సమాచారం కారణమై ఉంటుందని భోగట్టా. ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులలో ఆ మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ తరువాత ఏపీ సీఎం బాబుపై ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు ప్రకటించిన నేపధ్యంలో బాబుకు ఈ మధ్య మరింత ఎక్కువగా భద్రతను పెంచారు.

దానికి తోడు కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు కూడా సీఎం పర్యటనలలో హెచ్చరికలు జారీ చేయడంతో ఏజెన్సీ టూర్‌ రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే బాబు ఇకమీదట అరకు పర్యటనకు వచ్చే అవకాశాలే ఉండవంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు ముచ్చట పడి ప్రకటించిన దత్తత గ్రామం ప్రజలు మాత్రం బాబు వస్తారనే ఎదురుచూస్తున్నారు.