Home > Politics - Gossip
అమరావతిలో ‘దేవాన్ష్ కాలనీ’!

చంద్రబాబుకు ఇంకా ఏపీలో ఎక్కడా విగ్రహాలు ఏర్పాటు కాలేదు... చినబాబు పేరు కూడా రాష్ట్రంలో చాలా మందికి ఇంకా తెలియదు... కానీ.. బుల్లిబాబు.. అదేనండీ దేవాన్ష్ బాబు పేరుతో నూతన రాజధానిలో ఒక కాలనీ ఏర్పాటు కాబోతున్నదా? తాజాగా చంద్రబాబు సమక్షంలో జరుగుతున్న చర్చల సారాన్ని గమనిస్తే మాత్రం.. ఇలాగే అనిపిస్తోంది. అమరావతిలో దేవాన్ష్ కాలనీ ఏర్పాటు కావడంలో ఆశ్చర్యం లేదని అనిపిస్తోంది. స్వామిని మించిన స్వామిభక్తి ప్రదర్శించే వాళ్లు చేసే ప్రతిపాదనలు అలాగే ఉంటాయి మరి!

ఇంతకూ విషయం ఏంటంటే.. చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అమరావతిలోని మీడియా సంస్థల ప్రతినిధులతో ముచ్చట పెట్టుకున్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం దగ్గరినుంచి.. వారి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడడం ఆ సమావేశం ఉద్దేశ్యం. సదరు విందు సమావేశానికి  దాదాపుగా అందరూ చంద్రభక్తులను ఆహ్వానించి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ బృందంతో సమావేశంలో.. అమరావతిలో మీడియా వారందరికీ త్రీ బెడ్ రూం ఫ్లాట్ లు కట్టించి ఇస్తాం అంటూ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. దీనికోసం విధివిధానాలు కూడా రూపొందిస్తాం అని కూడా చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ... హాజరైన మీడియా ప్రతినిధుల్లోంచి ఒకరు స్పందించి.. ‘త్రీ బెడ్ రూం ఫ్లాట్ లు ఇవ్వడ అనేది చాలా అద్భుతమైన ఆలోచన అని.. అలా చేస్తే గనుక.. తాము కూడా చంద్రబాబు పట్ల కృతజ్ఞతతో ఆ కాలనీ దేవాన్ష్ కాలనీ అని నామకరణం చేస్తామని’ కూడా మాట ఇచ్చేశారు.

తన మనవడి పేరిట రాజధానిలో ఓ కాలనీ కూడా ఏర్పాటు చేయవచ్చుననే ఆలోచన ఇప్పటిదాకా చంద్రబాబుకు కూడా వచ్చిందో లేదో గానీ.. ఈ స్వామి భక్తశిఖామణి మాత్రం.. ఆ ప్రతిపాదనతో ఆ ఆలోచన కలిగించారు. చంద్రబాబు మాత్రం పైకి ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వకుండానే.. ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నారని సమాచారం. చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియా ప్రతినిధులకు ఇళ్లు కట్టించి ఇస్తారనగానే.. అదేదో హెరిటేజ్ సొమ్ముల్తో విరాళంగా కట్టించి ఇస్తున్నంత స్థాయిలో కృతజ్ఞతను చాటుకునే అత్యుత్సాహం మాత్రం చాలా మందికి పజిల్ గానే ఉండిపోయింది.