Advertisement


Home > Politics - Gossip
ఎంపీలు అంత దీనావస్థలో ఉన్నారా?

చిన్న ఉపోద్ఘాతం:

ఆ మధ్య ఏపీ సర్కారు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టారు.  ప్రతిపక్ష నాయకుడు జగన్ సహా అందరూ ఆ బిల్లుకు అనుకూలంగా మాత్రమే మాట్లాడి.. అనుకూలంగా మాత్రమే ఓట్లు వేసి.. తక్షణం ఆ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించారు. అది వారి జీతాలకు సంబంధించిన బిల్లు గనుక.. అందరూ ఈ రీతిగా స్పందించారు. అయితే ఆ సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఓ విభిన్నమైన ప్రసంగం చేశారు.

"ఎమ్మెల్యేలు ఏం కష్టపడుతున్నారు గనుక.. వారికి ఇంతేసి జీతాలు ఇవ్వాలి. ఇవాళ్టి రాజకీయాల్లో మారిన పరిస్థితుల్లో జీతం డబ్బు తీసుకువెళ్లి.. తమ కుటుంబ జీవనం గడుపుకోవడానికి దాన్ని ఖర్చు పెట్టుకునే ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరు. అందరూ సంపన్నులే ఉంటున్నారు. అలాంటప్పుడు ప్రజా సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యం ఇవ్వకుండా మన జీతాలు పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి" అని ఆయన ప్రశ్నించారు. ప్రసంగం రికార్డుల్లో మిగిలింది... జీతాలు మాత్రం పెరిగాయి. అయితే కోటంరెడ్డి మాత్రం ప్రతి నెలా తనకు వచ్చే జీతాన్ని తన నియోజకవర్గంలో పేదల సంక్షేమానికి ఉదారంగా ఖర్చు చేస్తుంటారు.

ఈ ఉపోద్ఘాతం మొత్తం ఎందుకంటే.. ఎంపీల్లో తమ జీతాలు పెంచడం లేదనే అసంతృప్తి బాగా ఉన్నదిట. ఇది ఈ రేంజిలో ఉన్నదంటే.. ప్రభుత్వం వేరే ఏ శాఖలకు చెందిన జీతాలు పెంచే బిల్లును సభ ముందుకు తీసుకువచ్చినా..  దీనికి మేమెందుకు అనుకూలంగా ఓటు వేయాలి.. మేం వేయం. అంటూ.. అధికార పార్టీకి చెందిన ఎంపీలే.. తమ సర్కారుతోనేకయ్యానికి దిగే పరిస్థితి కనిపిస్తున్నదిట. ఈ మధ్య న్యాయమూర్తుల వేతనాలు పెంచడానికి సంబంధించిన బిల్లు సభ ముందుకు తెచ్చినప్పుడు ఇదే పరిస్థితి వచ్చిందని.. ఇప్పుడు తెలుస్తోంది. పార్టీ సారథి అమిత్ షా.. తనదైన శైలిలో ఎంపీల పనితీరును మదింపు చేస్తోంటే.. దానితో పాటూ వారి వైఖరి, పోకడలు కూడా ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి.

అసలే ఇప్పటికే మన ఎంపీలకు అంతలేసి జీతాలు ఎందుకు ఇవ్వాలి. ఇదే దేశంలో.. కేవలం 400రూపాయలు చెల్లిస్తే. రెండు నెలలకు పైగా దేశమంతటా ఫ్రీగా ఫోను మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్న మొబైల్ కంపెనీలు ఉండగా.. ఎంపీలకు నెలకు లక్ష రూపాయలకు పైగా ఫోను బిల్లుల కోసం ఎందుకు చెల్లించాలి? ఎంపీలకు మాత్రం పార్లమెంటులో సబ్సిడీ భోజనాలు ఎందుకు పెట్టాలి? వంటి జోకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. ఇప్పుడు తమ జీతాలు పెంచేదాకా.. ఇతర వ్యవస్థల జీతలాపెంపునకు అడ్డం పడతాం.. అనే ఎంపీల వైఖరి తెలిసిందంటే.. వారి పరువు మరింతగా బజార్న పడినట్టే అని పలువురు అనుకుంటున్నారు.