Advertisement


Home > Politics - Gossip
'దొర'గారి ప్లాన్‌ - రెడ్డిగారికి చీవాట్లు.!

పాపం గుత్తా సుఖేందర్‌రెడ్డి.. హైకోర్టు నుంచి చీవాట్లను ఎదుర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులకు క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇవ్వడమేంటని గతంలో ఆయన కోర్టును ఆశ్రయించిన వ్యవహారంలో ఆయనకిప్పుడు తాజాగా మొట్టికాయలు పడ్డాయి. ఆసిక్తకరమైన విషయమేంటంటే, ఇక్కడ ప్లాన్‌ కేసీఆర్‌ది.. చీవాట్లేమో గుత్తా సుఖేందర్‌రెడ్డికి పడ్డాయి. 

అసలు విషయంలోకి వెళితే, అది గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో వున్నప్పటి పరిస్థితి. పార్టీ ఫిరాయింపుల్ని టీఆర్‌ఎస్‌ ప్రోత్సహించడం, పలువురు కాంగ్రెస్‌ నేతలు, టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేయడం తెల్సిన విషయమే. అప్పట్లో ప్రభుత్వ సలహాదార్లను నియమించి, వారికి క్యాబినెట్‌ ర్యాంక్‌ కట్టబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దాన్ని కాంగ్రెస్‌ నేతగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు, కోర్టును ఆశ్రయించారు కూడా. 

ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం. గుత్తా సుఖేందర్‌రెడ్డి మెడలో కండువా మారింది. ఏ పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారమని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెబుతూ వచ్చారో, ఆ పార్టీ ఫిరాయింపుల ట్రెండ్‌లోకి ఆయనా వెళ్ళక తప్పలేదు. టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. త్వరలో ఆయనగారికి ఓ నామినేటెడ్‌ పదవి కట్టబెట్టబోతున్నారు కేసీఆర్‌. ఈ క్రమంలోనే పాత కేసుని ఉపసంహరించుకోవాల్సిందిగా గుత్తాకి కేసీఆర్‌ సూచన చేశారట. 

అద్గదీ అసలు విషయం. కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ని ఉపసంహరించుకోవడానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రయత్నించారు. ఫలితం, న్యాయస్థానం చీవాట్లు. 'అంతా మీ ఇష్టమేనా.? మీకు ఇష్టం వున్నా, లేకపోయినా.. కేసు విచారణ కొనసాగుతుంది..' అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. గుత్తా సుఖేందర్‌రెడ్డికి కేసీఆర్‌ రైతుల పేరుతో ఓ సలహాదారు పోస్ట్‌ ఖాయం చేశారు. ఆ పదవికి క్యాబినెట్‌ ర్యాంక్‌ కూడా ఇవ్వనున్నారు. 

ఈ నేపథ్యంలోనే త్వరలో ఎంపీ పదవికీ రాజీనామా చేయాలనుకున్నారు. వ్యూహమేమో ఇప్పుడిలా బెడిసికొట్టింది. పదవి దక్కుతుందో లేదో, అది వేరే విషయం.. గుత్తా సుఖేందర్‌రెడ్డి పరువుపోయిందిక్కడ. రెడ్డిగార్ని బలిపశువుని చేసి, దొరగారు భలే పొలిటికల్‌ గేమ్‌ ఆడారు కదూ.! విలువలూ - వంకాయలూ అని మాట్లాడే గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు రాగలరా.? ఛాన్సేలేదు.