Home > Politics - Gossip
డౌట్‌: నంద్యాల్లో జనసేన అభ్యర్థి ఎవరు?

ఇవతల నంద్యాల ఉపఎన్నికల విషయంలో వైకాపా, తెలుగుదేశం పార్టీల హడావుడి క్రమక్రమంగా పెరుగుతోంది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు పార్టీలూ రంగంలోకి దిగుతున్నాయి. భూమా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న ఎన్నికే అయినా.. ఏకగ్రీవం సమస్యే లేదన్నట్టుగా ఇరువర్గాలూ రెచ్చిపోతున్నాయి.

వైకాపా నుంచి వచ్చిన భూమా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగుదేశం నుంచి వచ్చిన శిల్పా మోహన్‌ రెడ్డి వైకాపా తరపున అమీతుమీ తలపడనున్నారు. అలాకాదు.. భూమా ఫ్యామిలీ కాకుండా ఎస్పీవై అల్లుడికి చంద్రబాబు టికెట్‌ ఇవ్వనున్నాడనే ప్రచారమూ సాగుతోంది.

ఒకవేళ శిల్పా తెలుగుదేశంలోనే ఉండి ఉంటే, ఎస్పీవై మేనల్లుడిని రంగంలోకి దించి.. ఈసారి చచ్చినట్టు అతడిని గెలిపించండి అని చంద్రబాబు అటు శిల్పకు ఇటు అఖిలప్రియకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చేశాడు.

తను చెప్పిన అభ్యర్థి గెలవకపోతే మంత్రిపదవి పోతుందని అఖిలప్రియకు, గెలిపించకపోతే వచ్చేసారి కూడా నంద్యాల సీటు దక్కదని శిల్పకు బాబు ఆదేశాలు జారీ చేసే ప్లాన్‌లో ఉండినారు.

అయితే.. బాబు అలాంటి ట్విస్టేదో ఇస్తాడని అర్థం చేసుకున్న మోహన్‌ రెడ్డి ఇక లేట్‌ చేయడం మంచిది కాదని జంప్‌ చేశాడు. ఇక బాబు కూడా తప్పక భూమా ఫ్యామిలీకే టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. 

మరి ఈ రెండు పార్టీల ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో దున్నేస్తాం అంటున్న మూడుపక్షాలు నంద్యాల పోరుపై స్పందించాల్సి ఉంది.

వాటిలో ఒకటి కాంగ్రెస్‌ పార్టీ, రెండు జనసేన, మూడు బీజేపీ. ముఖ్యంగా జనసేన.. నంద్యాల బై పోల్స్‌లో ఎవరికి మద్దతునిస్తుందో చూడాల్సి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన 'పాత్ర' ఏమిటో వివరించనక్కర్లేదు.

మరి నంద్యాల బై పోల్స్‌లో ఆ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతోందో కూడా తెలియాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో.. తను ఎన్డీయే కూటమికి మద్దతునిచ్చామని ఆ మధ్య పవన్‌ ట్వీట్‌ చేశాడు. మరి నంద్యాల్లో ఎవరికి మద్దతునిస్తాడో, ఎవరిని గెలిపించాలని పిలుపునిస్తాడో చూడాల్సి ఉంది.

ఒకవేళ జనసేన ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం వస్తే... అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ ప్రశ్న. అలా కాకుండా... ఎవరో కమ్యూనిస్టు నేత అంటున్నాడు.. జనసేన, కమ్యూనిస్టులు, లోక్‌సత్తాలతో కూటమి అని. కాంగ్రెస్‌ను కూడా కలుపుకునేలానే ఉన్నారు. మరి వీరంతా కలిసి పోటీచేసి తమ సత్తా చూపిస్తారేమో చూడాలి.