Home > Politics - Gossip
ఈ భుజాల తడుముడు ఏమిటి?

గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే, ఎవరో భుజాలు తడుముకున్నట్లుగా వుంది వ్యవహారం. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వున్నానని మీడియాను నమ్మించి, కొన్ని గంటల సేపు గాయబ్ అయ్యారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విషయంపై ప్రతిపక్షాలు నిలదీయడం ప్రారంభించాయి. దీనికి అధికార పక్ష నాయకులు మాత్రం ఏ బదులూ ఈయలేకపోయారు. ఏమంటే, ఏమొస్తోందో అని భయపడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని, చంద్రబాబు మనసు తెలుసుకుని, ఆల్ మోస్ట్ అధికార ప్రతినిధిలా వుండే మీడియా లో మాత్రం భలే చిత్రమైన వివరణ వచ్చింది. అది చదివితే, మెడమీద తలకాయ వున్నవాడు ఎవ్వడూ నమ్మలేడు.

ఢిల్లీలో గాయబ్ అయిన అన్ని గంటల సేపు కూడా చంద్రబాబు రాష్ట్రం కోసమే తిరిగారట. అదేదో వెనకటికి, నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని, ప్రవచించినట్లు. బాబు ఏం చేసినా, అది వెలుతురులో అయినా, చీకటిలో అయినా రాష్ట్ర అభివృద్ధికే అంటోందీ మౌత్ పీస్. ఏదో కంపెనీ ఎప్పటి నుంచో రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతోందట. ఆ డిస్కషన్ ల్లో పార్ట్ గానే ఢిల్లీలో కూడా డిస్కషన్లు కంటిన్యూ చేసిందట. అయితే ముందుగానే చెప్పిందట. తమ షేర్ మీద ప్రభావం చూపిస్తుంది, అందుకని ఏ విషయాలు బయట పెట్టవద్దని. ఇది మరీ చిత్రంగా వుంది.

ఏ కంపెనీ అయినా కొత్త వెంచర్ లేదా కొత్త ప్రాజెక్టు యత్నాలు చేస్తోందీ అని తెలిస్తే, దాని షేర్ వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గదు. మరి ఇక్కడ ఈ కంపెనీ ఎందుకు భయపడింది. అంటే, ఆంధ్రతో సంప్రదింపులు చేస్తుంటే షేర్ వాల్యూ తగ్గుతుందని అనుకుంటోందా? పైగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రితో కీలక చర్చలు సాగిస్తూ రహస్యంగా వుంచమని కోరడం ఏమిటి? దానికి ఓకె అని, అనడం ఏమిటి? 

ఇదే ముక్క అధికారికంగా చెబితే, ప్రతిపక్షం నుంచి మరిన్ని కౌంటర్లు, మరిన్ని అనుమానాలు వస్తాయి. అందుకే తెలివిగా తమ మనసు ఎరిగి వార్తలు రాసే మీడియా ద్వారా బయటకు వదిలినట్లుంది. ఇలాంటి రాతలు నమ్మే అమాయకపు జనానికి కొదవలేదు కదా? అదే కదా దేశానికి శ్రీరామరక్ష.