Home > Politics - Gossip
నేరం వారిది కాదు.. వర్షానిది : కేసు పెడ్తారా?

అచ్చంగా అధికార్ల నిర్లక్ష్యం, ఎన్నాళ్ల నుంచో ఉన్న ప్రతిపాదనల్ని పట్టించుకోకపోవడం పర్యవసానంగా ఏకంగా 23మంది ప్రాణాలు కోల్పోతే.. అందుకు ఎవ్వరికీ బాధ్యత లేదంటూ విచారణ కమిటీ నిగ్గు తేల్చడం మరింత ఘోరమైన పరిణామం. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాట ఇటీవలి కాలంలో ఘోరమైన మానవ తప్పిదం. అయితే ఈ వ్యవహారంలో అసలు ఎలాంటి మానవ పొరబాటు లేదని, ఎవ్వరూ ఎలాంటి తప్పు చేయలేదని.. నేరం మొత్తం వర్షానిదేనని విచారణజరిపిన కమిటీ నిగ్గు తేల్చింది. వర్షం, జనం రద్దీ ఎక్కువగా ఉండడం కారణాలు అని చెప్పేశారు. 

ఎల్ఫిన్ స్టోన్ దారుణం అనేది రైల్వేశాఖ ఉన్నతాధికార్ల, ఢిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి మచ్చుతునక ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదనే టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. నిజానికి అక్కడ నిత్యం ఉండే జనం రద్దీకి ఇది చాలా ఇరుకైన బ్రిడ్జి. దీనిని వెడల్పు చేయడం గురించి కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాదనలు నడుస్తున్నాయి. ఢిల్లీనుంచి వాటికి ఆమోదం మాత్రం లభించలేదు.

ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి ఎంపీ ప్రత్యేకంగా పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. అయితే... ప్రతి ఎంపీ ప్రస్తావించే ప్రతి విషయం గురించి పట్టించుకునే తీరిక రైల్వేశాఖకు ఉండదని అర్థం వచ్చేలా.. నిర్లక్ష్యపూరితమైన సమాధానం వచ్చింది. అంతే తప్ప.. సమస్యను చక్కదిద్దడం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. పర్యవసానంగానే ఇవాళ ప్రమాదం జరిగింది. 

అయితే దీనిపై వేసిన విచారణ కమిటీ మాత్రం ఎలాంటి మానవ తప్పిదం లేదన్నట్లుగా తేల్చడం ఆశ్చర్యకరం. వీరు దాదాపు 30 మందిని విచారించి.. 23 మంది మరణానికి కేవలం వరుణదేవుడే కారణం అని తేల్చారు. వర్షం రావడం.. రద్దీ ఎక్కువ కావడం , అదే సమయానికి నాలుగు రైళ్లు ప్లాట్ ఫారం మీదికి రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. మరి రద్దీని నియంత్రించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవా అనే ప్రశ్నకు వీరివద్ద సమాధానం లేదు. 

అలాగే.. ఎవరో వ్యక్తి ‘ఫూల్ గిర్ గయా’ అని అరిచారుట. ఆ మాటలను మిగిలిన ప్రజలు ‘బ్రిడ్జి గిర్ గయా’ అన్నట్టుగా అర్థం చేసుకుని తొక్కిసలాట పెరిగిందిట. కేవలం కారణాలన్నీ ఇవే తప్ప.. మానవతప్పిదం లేదని నివేదిక తేల్చింది.

23 మంది ప్రాణాలు బలి అయిన తర్వాత కూడా ఆత్మవంచన చేసుకుంటూ ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులు ఉన్నంత కాలమూ ఇక పరిస్థితులు ఎలా బాగుపడతాయి. నేరం నాది కాదు.. వర్షానిది అంటే.. కేసు ఎవరి మీద పెట్టాలి? అని విస్తుపోతున్నారు జనం.