Home > Politics - Gossip
ఎవరికి వాళ్లు వాయించుకుంటున్నారెహె!

జీఎస్టీ అనే ఒక చిన్న బ్రహ్మపదార్థం లాంటి పదంతో.. మోడీ సర్కారు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంది. పన్నుల్ని వసూలు చేసి.. స్థిరపరచడం ఎలాగ.. రాష్ట్రాలకు వాటాలు పంచడంలో మతలబులు ఎలాగ.. అనే విషయాలు తప్ప.. ప్రజల కోణంలోంచి ఎలాంటి వాటిపై పన్ను పెంపు ఏ రకంగా ఉండాలి అనే ఆలోచనపై ఏమాత్రం జరగకుండానే ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తెచ్చేసింది.

జీఎస్టీ పేరుతో ఒక్కసారిగా భయంకరంగా ప్రజల నెత్తిన భారం వేసేసిన తర్వాత.. ఆ తర్వాత.. కేంద్రం ప్రభుత్వం సమీక్షలు ప్రారంభించింది. పన్నులను దఫదఫాలుగా సవరిస్తూ.. వస్తోంది. తాజాగా కూడా జీఎస్టీ మండలి సమావేశంలో సామాన్యులకు అవసరమైన అనేక రకాల వస్తుసేవల విషయంలో పన్నులను తగ్గించింది. అంతవరకూ ఓకే.

అయితే ఆ తర్వాతి ఎపిసోడ్ లోనే పెద్ద కామెడీ నడుస్తోంది. జీఎస్టీ పన్నులను తగ్గించి ప్రజలకు చాలా మేలు చేసేసాం అని సహజంగానే బీజేపీ సర్కారు ప్రచారం చేసుకుంటూ ఉంది. మధ్యలో రాహుల్ గాంధీకి కూడా మూడొచ్చింది. రాహుల్ గాంధీ చేసిన విమర్శల వల్లనే, ఆ విమర్శలకు భయపడి మాత్రమే.. కేంద్రం జీఎస్టీ పన్నులను సవరించిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడం ప్రారంభించింది.

ఆ మాటకొస్తే ఒక్క  రాహుల్ ఏం ఖర్మ, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసింది. కానీ ఆ పార్టీలోని నాయకుల స్వామిభక్తి.. భాజపా తగ్గించిన పన్నుల క్రెడిట్ ను కూడా తమ నాయకుడి ఖాతాలో వేసేయాలనే ఉత్సాహాన్ని కలిగించడం విశేషం.

ఇదొక కామెడీ ఎపిసోడ్ అయితే.. ఏపీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా తమ చొరవ వల్లనే కేంద్రం జీఎస్టీ పన్నులు తగ్గించిందని అంటున్నారు. ఇలా ప్రజల దృష్టిలో కాస్త ఉపశమనం కలిగించగల ఒక్క నిర్ణయాన్ని సెంట్రల్ గవర్నమెంటు తీసుకున్న వెంటనే.. దేశవ్యాప్తంగా.. ఎవరికి వారు ఆ క్రెడిట్ నాదంటే నాదని సొంత డబ్బా కొట్టుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

మంచి పని ఒకటి జరిగిన తర్వాత.. నా వల్లనే జరిగిందని ఎవరైనా చెప్పుకోవచ్చు గానీ.. వారు తీసుకున్న చొరవ ఏమిటో ఏ అంశాల గురించి కేంద్రానికి ఎప్పుడెప్పుడు లేఖలు రాశారో.. ఆ లేఖల్లో ఏయే అంశాలను ప్రస్తావిస్తే.. ప్రస్తుతం ఏం పన్నులు తగ్గాయో ఈ సంగతులు ప్రజలు అర్థం చేసుకునేలా లేఖల్నే విడుదల చేస్తే జనం నమ్మరు. ఇలాంటి కాకమ్మ కబుర్లు జనం చాలా చూస్తూఉంటారు కదా!