Home > Politics - Gossip
ఒకవైపు వివరణ.. మరోవైపు వివాదం : లెవెల్ చేసిన జగన్

‘ఒక ప్రాణం తీశా.. ఒక ప్రాణం పోశా.. ’ లెవెలైపోయింది అంటూ ఓ సినిమాలో చాలా ఫేమస్ డైలాగు ఒకటుంది. వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకూడా అదేవిధంగా కనిపిస్తోంది. ’ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కాల్చినా తప్పులేదు‘ అంటూ బహిరంగ సభలో చేసిన ఆరోపణలకు గాను.. ఎన్నికల సంఘం నోటీసులు పంపేసరికి... వాటికి ఒకవైపు వివరణ ఇచ్చిన జగన్మోహనరెడ్డి, ఆ వివరణ అందిందని ఈసీ ధ్రువీకరించే సమయానికే.. అదే తీరుగా మరో వివాదాస్పదమైన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. ఈసారి చంద్రబాబును ఉరి తీసినా తప్పులేదంటూ ఆయన రోడ్ షోలో బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం. 

నంద్యాల ఎన్నికల బహిరంగ సభలో జగన్ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరూ గమనిస్తున్నదే. ఆ సభలో ఏకంగా అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నడిరోడ్డు మీద నిలబెట్టి కాల్చిన సరే తప్పులేదంటూ జగన్ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. ఆయన తనలోని దూకుడును ఆపుకోలేక అన్న ఆ మాట వల్ల.. యావత్తు బహిరంగ సభ ప్రసంగంలో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాల గురించి చేసిన ఆరోపణలన్నీ పక్కకుపోయాయి. అటు ప్రజలకుగానీ, అధికార పక్షానికి గానీ.. అదొక్కటే పాయింట్ దొరికింది. అందరూ దాన్ని పట్టుకుని.. జగన్ ఇంత దుర్మార్గపు వ్యాఖ్య ఎలా చేశాడంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగింది. 

జగన్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన ఎన్నికల సంఘం పురమాయించడంతో.. కర్నూలు జిల్లా కలెక్టరు జగన్ కు నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ కోరారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను తలచుకున్న ఆవేదనలో అలా మాట్లాడాను తప్ప.. ఆ మాటలకు వాస్తవ అర్థం తీసుకోవడం సరికాదంటూ జగన్ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జగన్ వివరణను రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. నిర్ణయం వారు తీసుకుంటారని కూడా వెల్లడించారు. 

ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే.. జగన్ మళ్లీ అదే దూకుడును ప్రదర్శించారు. అయితే ఈసారి ఆయన చాలా ప్లాన్ డ్ గా.. నిపుణుల సలహాలు తీసుకునే.. చంద్రబాబు మీద కామెంట్లు చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. నంద్యాలలో రెండోరోజు రోడ్ షోలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ.. అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. 

సాంకేతికంగా చూస్తే.. ‘‘నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చినా పర్లేదు’’ అనే వ్యాఖ్య.. తాను చేయదలచుకున్న చర్యగా మనోగతం వెల్లడించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో, ఉరిశిక్ష వేసినా పర్లేదు అనే వ్యాఖ్యలో ‘‘న్యాయవ్యవస్థ ఆయనకు ఆ శిక్ష విధించినా తప్పులేదు’’ అనే అభిప్రాయం వెల్లడించినట్లుగా ఉంటుంది. ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేకుండా ఈ సాంకేతిక మెలికతో దూషించినా పర్లదేని జగన్ అనుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.