Advertisement


Home > Politics - Gossip
పోలవరంపై గడ్కరీ మొహం చాటేస్తున్నారా..?

పోలవరం గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వెళ్లి అడిగితే.. అంతా మేం చూసుకుంటాం.. ఈ ప్రాజెక్టు మాదే.. అని చాలా తియ్యటి మాటలు చెబుతారు... ఆ తర్వాత మళ్లీ ఎవరైనా వెళ్లే వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉండదు.

ఇలాంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం అందించే వ్యవహారం డోలాయమానంగా మారుతున్న వేళ.. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. పదిహేను రోజులకు ఒకసారి ప్రాజెక్టు విజిట్ చేసి సత్వరం పనులు పూర్తి చేయించేస్తానని గతంలో మాట ఇచ్చిన ఆయన నెలలు గడుస్తున్నా ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇటువైపు రాకపోవడం ప్రజలకు సందేహాలు కలిగిస్తోంది.

గతంలో అధికార్లు ఏపీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు గడ్కరీ చాలా గట్టి మాట ఇచ్చారు. ప్రతి 15రోజులకు ఒకసారి పోలవరం వచ్చి.. తాను పనులు వేగంగా అయ్యేలా చూస్తానని మాట ఇచ్చారు. అది జరిగి కూడా రెండు నెలలు దాటిపోయినట్లుగా కనిపిస్తోంది. తొలుత డిసెంబరు 22న గడ్కరీ పోలవరానికి వస్తారని చాలా ప్రచారం జరిగింది.

దీనికి లోకల్ అధికార్లు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత అది రద్దయింది. 23న నిపుణుల కమిటీ మాత్రం వచ్చి వెళ్లింది. ఆ పిమ్మట ఢిల్లీనుంచి జనవరి 7వ తేదీన గడ్కరీ పోలవరం రాబోతున్నట్లుగా మరో ప్రకటన వచ్చింది. 7వ తేదీ గడచిపోయింది గానీ గడ్కరీ మాత్రం రాలేదు. అయితే ఈ వైఫల్యాల్ని జనం గుర్తించ రాదన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం.. ఎటూ సోమవారమే గనుక.. వర్చువల్ బదులుగా నిజంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనుల్ని పరిశీలించారు.

అయితే.. కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వకుండా నానుస్తున్నందు వల్లనే .. స్వయంగా ఇక్కడకు వస్తే.. నిదులు – పనుల వేగం గురించి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుందనే భయంతోనే నితిన్ గడ్కరీ మొహం చాటేస్తున్నట్లుగా పలువురు అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు 17న మోడీతో భేటీ అయిన తర్వాత అయినా పరిస్థిత్లుల్లో ఏదైనా మార్పు వస్తుందేమో అని జనం నిరీక్షిస్తున్నారు.