Advertisement


Home > Politics - Gossip
అవమానం తప్పింది.. అనుమానం మిగిలింది!

చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి గొప్ప అవమానకరమైన ఘట్టం తప్పిపోయింది. తమంతగా స్వచ్ఛమైన పాలన అందించే ప్రభుత్వం మరొకటి ఉండదని, తాము నిజాయితీగా, పూర్తి పాదర్శకంగా పరిపాలన సాగిస్తుంటాం అని చంద్రబాబునాయుడు పదేపదే చెబుతుంటారు. అయితే ఆయన వ్యవహార సరళికి తీసుకునే నిర్ణయాలకు, ఆ నిర్ణయాల విషయంలో పంతానికి పోవడానికి వీటన్నిటికీ కలిపి ఒక అవమానం తప్పిపోయింది.

ఒకే బిల్లును ప్రభుత్వం రెండు సార్లు పంపితే.. వివాదం రేగినా సరే.. సంతకం పెట్టకుండా రెండుసార్లు గవర్నరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అంటే చిన్న సంగతి కాదు. ఆ అవమానాన్ని ప్రభుత్వం తప్పించుకుంది. గురువారం ఆయన సంతకం పెట్టేశారు. నాలా బిల్లు కాస్తా చట్టం అయిపోయింది. కాకపోతే.. గవర్నరు అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేసింది సరే.. వాటిని ప్రజలకు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. వారి హృదయాల్లో ఆ అనుమానాలు సజీవంగానే ఉన్నాయి.

నాలా బిల్లు అంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి సంబంధించిన చట్టం. ఈ చట్టం రాబోతున్నదని ముందే తెలిసి ఉంటే.. వ్యవసాయ భూములను ఆ ధరలకు కొనేసి ఉంచుకున్న వారందరూ.. ఈ చట్టం తయారైన వెంటనే ఒక్కసారిగా కరోడ్ పతిలు అయిపోతారు. అందరి భూముల ధరలకు రెక్కలు వస్తాయి. కాబట్టే చాలా మంది ఈ బిల్లు మీద గవర్నరు సంతకం పెట్టకపోయే సరికి ఆందోళనకు గురయ్యారు. ఆ సంగతుల్ని పక్కన పెట్టినా.. గవర్నరు వ్యక్తం చేసిన అభ్యంతరాల మాటేమిటి?

ఎవరైనా వ్యవసాయ భూముల కన్వర్షన్ గురించి దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే వాటిని అలా మార్చేయాల్సిన అగత్యం ఏమిటి? వాటిని గురించి తనిఖీచేసి యాజమాన్యం హక్కులను పరిశీలించి ఇచ్చే ఏర్పాటు ఉందా? అది అసలు ఏ కేటగిరీ కిందకు వస్తుందో? ఏ శాఖ కు చెందిన భూమో.. పరిశీలించకుండానే ఇచ్చేస్తారా? అక్రమంగా మార్పు చేసుకుంటే ఎలా నియంత్రిస్తారు? తప్పుడు కన్వర్షన్ జరిగోతే.

మళ్లీ వెనక్కు భూమిని యథాతథ స్థితికి తెచ్చే ఛాన్సుందా అని అడిగారు. నిజానికి ఇవన్నీ చాలా కీలకమైన విషయాలు. ప్రభుత్వం వీటిని ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. కాకపోతే.. ఆర్డినెన్సును తిరస్కరించిన గవర్నర్.. శాసనసభ ఆమోదించిన బిల్లును కూడా అవే సందేహాలతో తిప్పికొట్టారు. బుధవారం ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. చంద్రబాబుతో మాట్లాడి అధికారులు గురువారం సమాధానం ఇవ్వడంతో మొత్తానికి సంతకం పూర్తయింది.

గవర్నరు రెండు సార్లు తిప్పి పంపడమే ప్రభుత్వానికి చాలాపెద్ద అవమానం కింద లెక్క. కానీ.. ఆయన సంతకంతో ఇప్పుడు అవమానం తప్పినట్టే. కాకపోతే.. ఆయన అభ్యంతరాలన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చాయి. ప్రజల్లో రేగిన  అనుమానాల్ని  చంద్రబాబు నివృత్తి చేస్తారా? లేకపోతే.. నేను మోనార్క్ ను అనుకుంటూ ముందుకెళ్లిపోతారా? వేచిచూడాలి.