Advertisement


Home > Politics - Gossip
గ్రేటాంధ్ర అప్పుడే చెప్పింది : దోపిడీ ఎంతో తేలుతుంది

సదావర్తి భూములకు గురువారం నాడు వేలం జరగాల్సి ఉంది. ఈ వేలం పూర్తయితే చాలు.. తెలుగుదేశం నాయకులు గూడుపుఠాణీగా మారి.. ఎన్ని కోట్ల రూపాయలను అప్పనంగా దోచేయడానికి స్కెచ్ వేశారో తేటతెల్లం అయిపోతుంది. అందుకే ఈ సమయంలో.. అసలు వేలం జరగకుండా ఆపు చేయడానికి, వేలంలో ఎవ్వరూ పాల్గొనకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని కాస్త పక్కన పెడితే.. సదావర్తి భూముల విషయంలో తొలుత హైకోర్టు తీర్పు వచ్చినప్పుడే గ్రేటాంధ్ర ఓ సంగతి ప్రస్తావించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వేలం జరుగుతోంది. 

సదావర్తి భూముల విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై తీర్పు చెబుతూ.. వందల కోట్ల విలువైన భూములు 22కోట్లకు తెదేపా వాళ్లు సొంతం చేసుకున్నారని అంటున్నప్పుడు.. ప్రభుత్వం చెబుతున్నట్లుగా 5 కోట్లు ఎక్కువ చెల్లించి ఆళ్ల తీసుకోవచ్చునని హైకోర్టు చెప్పింది. అంతమాత్రాన ప్రజలకు ఒరుగుతున్న లాభం ఏంటంటూ.. గ్రేటాంధ్ర సందేహాలు వ్యక్తం చేసింది.

తెదేపా 22కోట్లకు దోచుకుంటే.. వైకాపా ఎమ్మెల్యే 27కోట్లకు దోచుకున్నట్లు అవుతున్నదని.. మళ్లీ వేలం నిర్వహిస్తే బాగుంటుందని గ్రేటాంధ్ర కథనం పేర్కొంది. తర్వాత మళ్లీ వేలం నిర్వహించడానికే హైకోర్టు  కూడా తీర్పు చెప్పింది. దానికే ఇప్పుడు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లో ‘‘ప్రజలకేం ఒరిగింది అమరేశ్వరా?’’ శీర్షికతో గ్రేటాంధ్ర ఈ కథనం అందించింది.

(సదావర్తి భూములపై విపులంగా అందించిన పాత   కథనం ఇక్కడ చదవండి)

మొత్తం 82ఎకరాల భూముల్లో 79ఎకరాలకు ఇప్పుడు వేలం నిర్వహిస్తున్నారు. ఎంత దారుణంగా వేలం జరిగినా వందల కోట్లలోనే ధర పలికే అవకాశం ఉంది. వేలం పూర్తయితే గనుక.. ఎన్ని కోట్ల రూపాయల దోపిడీకి తెలుగుదేశం నాయకులు తెగబడ్డారో తేటతెల్లం అవుతుంది. ఇప్పటికే 27కోట్లకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సిద్ధంగా ఉన్నారు.

భూముల చెన్నైలో అత్యంత విలువైన ప్రాంతంలో ఉన్నాయి గనుక.. అక్కడి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు గానీ.. జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు చేపట్టే పెద్దపెద్దసంస్థలు గానీ పాల్గొంటే.. వేలం ఎక్కడికో వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. వేలం జరగకుండా అడ్డుకోవడం అనేది సుప్రీం ద్వారా కూడా సాధ్యం కాకపోవడంతో.. తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా చప్పుడు చేయకుండా ఊరకుంటున్నారు. మరి వేలం పూర్తయ్యే సమయానికి వారి మొహాలు ఎలా కత్తివేటుకు నెత్తురుచుక్క లేకుండా మారుతాయో చూడాలి.