Home > Politics - Gossip
హవాలా.. కేరాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడన్నా వరుస 'హవాలా' కేసులు వెలుగు చూస్తున్నాయంటే, అది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. ఆ లెక్కన, ఆంధ్రప్రదేశ్‌ని 'హవాలా' కుంభకోణాల్లో నెంబర్‌ వన్‌గా ప్రకటించేయొచ్చు. ఎందుకిలా.? అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది.? ప్చ్‌.. ఎవరికీ అర్థం కావడంలేదు. కోట్లు.. వందల కోట్లు హవాలా రూపంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 'మాయమైపోతోంది'.. అయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం తాను నిప్పు అని చెప్పుకోవడమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో నిప్పులాంటి పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్నారు. 

మొన్నీమధ్యనే విశాఖలో భారీ హవాలా కుంభకోణం వెలుగు చూసింది. అటూగా వెయ్యి కోట్ల రూపాయల వరకు హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలించాడో యువకుడు. నిండా పాతికేళ్ళు కూడా లేని ఆ యువకుడు హవాలా కుంభకోణంలో పట్టుబడ్డాడు. ఇప్పుడా కేసుకు సంబంధించి తీగ లాగుతున్నారు.. డొంక కదులుతోంది. అంతలోనే, విజయవాడలో మరో హవాలా కుంభకోణం వెలుగు చూసింది. చిత్రంగా ఈసారి, ఈ కుంభకోణంలో పలువురు డాక్టర్లు, ఆసుపత్రుల అధినేతలు, ఆఖరికి పోలీసు ఉన్నతాధికారులూ ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనార్హం. 

ఓ వ్యక్తి కిడ్నాప్‌ వ్యవహారంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఓ ఛానల్‌ ప్రతినిథి సమక్షంలో తనపై దాడి జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అసలు బాధితుడినని చెప్పుకుంటున్న వ్యక్తి బాధితుడే కాదనీ, తామే అసలైన బాధితులమని డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు (డాక్టర్లు, ఆసుపత్రుల అధినేతలు) వాపోతున్నారు. మరి, పోలీసు ఉన్నతాధికారుల సంగతేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

విశాఖను ఐటీ కేంద్రంగా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. విశాఖ ఇప్పుడు హవాలాకి కేంద్రమైపోయింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిని చేస్తానన్నారు చంద్రబాబు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌కీ, ఇదిగో ఇప్పుడు హవాలా కుంభకోణానికీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది అమరావతిలోని విజయవాడ. అయ్యా చంద్రబాబుగారూ.. అదిరింది మీ అద్భుత పాలన.!