Advertisement


Home > Politics - Gossip
ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై వైసీపీ కూడా కేసుపెట్టిందా?

రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం సోష‌ల్‌మీడియా కార్య‌క‌ర్త‌ల అరెస్టులు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స‌మాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెట్టిన ఇంటూరి ర‌వికిర‌ణ్‌, ఇప్పాల ర‌వీంద్ర‌ల‌ను ప్ర‌భుత్వం అరెస్ట్ చేసి జైళ్లో పెట్టింది. చంద్ర‌బాబు అస‌హ‌నానికి, నిరంకుశ‌త్వానికి ఈ అరెస్టులు నిద‌ర్శ‌న‌మ‌ని ఇటు ప్ర‌తిప‌క్షాలు, అటు ప్ర‌జాసంఘాలు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నాయి. సుప్రీం రిటైర్డ్ జడ్జి మార్కండేయ క‌డ్జూ మ‌రో అడుగు ముందుకేసి భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తుల‌కు లేఖ‌లు కూడా రాశారు. ఇది దేశ‌వ్యాప్త ఇష్యూగా మారి ప్ర‌భుత్వం ప‌రువు పోతుందేమోన‌ని భ‌య‌ప‌డిన బాబు స‌ర్కారు ఈ అరెస్టులపై వివ‌ర‌ణ ఇచ్చింది.

ప్ర‌భుత్వం త‌ర‌ఫున బాబు స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ స‌భ్య‌స‌మాజం అస‌హ్యించుకునే స్థాయిలో నీచ‌మైన మార్ఫింగ్ చిత్రాలు, భాష‌తో సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయ‌డం భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ఆస‌క్తిక‌ర విష‌యం కూడా చెప్పారు. అదేంటంటే బాబు ప్ర‌భుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసింద‌ని ఆరోపిస్తున్న ఇంటూరి ర‌వికిర‌ణ్‌పై వైసీపీ పార్టీ కూడా గ‌తంలో కేసు పెట్టిందట‌. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌పై అస‌భ్య‌క‌ర రాత‌లు రాస్తున్నాడంటూ 2014 జులై 31న విశాఖ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో వైసీపీ ఫిర్యాదు చేసిందంటూ ప‌ర‌కాల పాత రికార్డులు తోడాడు. మ‌రి అప్పుడు వైసీపీకి భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ గుర్తురాలేదా అని అడిగారు. మ‌రి ప‌ర‌కాల చేసిన ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మా? కాదా అనేది వైసీపీ స్పందిస్తేగానీ తెలియ‌దు.