Home > Politics - Gossip
పవన్‌కు ఆహ్వానం ఒక వ్యూహం!

ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య అనేది రాజకీయ సమస్యగా మారుతున్నదా? దీనిద్వారా రాజకీయ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పాలకులు వ్యూహాలు రచిస్తున్నారా? ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి తీవ్రస్థాయిలో గళం వినిపించిన పవన్ కల్యాణ్ ను... ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించడం, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందంతో జరిగే భేటీలో పాల్గొని సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కోరడం.. ఇప్పుడు రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. 

ఉద్ధానం సమస్యను ప్రభుత్వం పరిష్కరించదలచుకుంటే సర్వధా అది అభినందనీయమైన చర్యే. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి నిపుణులను పిలిపించి.. వారితో ముఖ్యమంత్రి భేటీ ఏర్పాటు చేసుకోవడమూ కూడా అర్థం చేసుకోవచ్చు. రాజధాని అమరావతి నగరం కట్టాలంటేనే... ఈ దేశంలో డిజైన్లు రూపొందించగల నిపుణులు లేరన్నట్లుగా లండన్ లోని ఆర్కిటెక్ట్ లను ఆశ్రయించే ఈ ప్రభుత్వం... వైద్యం చేయడానికి హార్వర్డ్ వారిని ఆశ్రయించడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే.. డాక్టర్లతో భేటీకి పవన్ ను ఆహ్వానించడంలో మతలబు ఏమిటి?

దీనిపై అనుమానాలు రేకెత్తడానికి సహేతుకత ఉంది. ప్రభుత్వానికి కంటగింపు అయ్యేలా అనేక ప్రజాసమస్యలపై అనేక మంది ఉద్యమాలు చేస్తూ ఉంటారు. తమ గళం వినిపిస్తూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. తటస్థులు కూడా అనేక ఉద్యమాలు చేస్తూ ఉండడం కద్దు. కానీ.. ఆయా సమస్యలపై ప్రభుత్వం కార్యాచరణకు పూనుకున్నప్పుడు సదరు వ్యక్తులను కూడా పిలిపించి.. వారితో కూడా చర్చించి.. వారిని కూడా భాగస్వాములుగా చేయడం మాత్రం ఎప్పుడూ జరగదు.

క్రెడిట్ మొత్తం ప్రభుత్వానికే దక్కాలి తప్ప ఉద్యమం చేసిన వారికి కాదు అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉండొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 

1) పవన్ కల్యాణ్ ప్రభుత్వంతో కలిసి ఉన్నట్లు.. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయనకు కూడా భాగం ఇస్తున్నట్లుగా కాపు సామాజిక వర్గంలో ఒక భ్రమ కల్పించడం. ఇప్పటికే కాపు వర్గంలో విలువ తగ్గిపోయి తెలుగుదేశం నానా పాట్లు పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ తమతో ఉన్నాడు... తమ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు అనే ఫీలింగ్ ను జనంలోకి వ్యాప్తి చేయడానికి ఇలా అధికారిక సమావేశాలకు ఆయనను ఆహ్వానించడం ఉపయోగపడుతుందనేది వారి ఆలోచన.

2) ఉద్ధానం మీద తీసుకునే చర్యల్లో పవన్ కల్యాణ్ కు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడం, ప్రయారిటీ ఇవ్వడం ద్వారా, ఆయన లేవనెత్తిన ఆక్వాఫుడ్ పార్క్ వంటి ఇతర కీలక సమస్యలను ఆయనే మరచిపోయేలా చేయడం.

మొత్తానికి పవన్ ను ఆహ్వానించడంలో రాజకీయంగా పెద్ద స్కెచ్చే కనిపిస్తోంది. మరి పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశాక రాజకీయ అంశాలు మాట్లాడతారో లేదో తెలియదు. భేటీ తర్వాత.. ఆయన స్పందించే తీరును బట్టి.. ఇంకాస్త మర్మం బోధపడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.