Home > Politics - Gossip
లీగల్ ఫైట్ కు కేసీఆర్ తొడకొడతారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మీద కాలు దువ్వడానికి సిద్ధంగానే ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం మీద పడుతున్న అదనపు భారాన్ని తప్పించుకోవడానికి, అందులో ఉన్న అనౌచిత్యాన్ని ఎండగట్టడానికి ఆయన న్యాయమార్గాన్ని అనుసరించే అవకాశం ఉందా? ఢిల్లీలో శస్త్ర చికిత్స నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్.. తాను న్యాయం అని నమ్మిన దానిని సాధించుకోవడానికి పోరాడానికి సిద్ధపడతారా? అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సగంలో ఉన్న వివిధ నీటి ప్రాజెక్టులపై కేంద్రం తాజాగా విధించిన జీఎస్టీ భారం విషయంలో.. తెలంగాణ సర్కారు పోరాటానికి సిద్ధమేనా? అనే చర్చ జరుగుతోంది. 

జీఎస్టీ అనే పన్ను భారాన్ని కేంద్రం ఎన్ని రకాల డొంక తిరుగుడు మార్గాల్లో పరోక్షంగా ఎన్ని విధాలుగా ప్రజల నడ్డి విరిచేలా వడ్డించిందో ... ఇప్పటిదాకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. అయితే కేవలం సామాన్యుల వినియోగవస్తువల మీద మాత్రమే కాకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు తదితర వ్యవహారాల మీద కూడా జీఎస్టీ భారం పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.

కొత్తగా ప్రాజెక్టుల మీద వడ్డించిన 12 శాతం జీఎస్టీ కి వ్యతిరేకం కాకపోయినప్పటికీ, జీఎస్టీ అమలుకంటె ముందే ప్రారంభమైన ప్రాజెక్టులకు దీనిని వర్తింపజేయడం తగదని వారు వాదించారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి చాలా సీరియస్ గా ఓ లేఖ కూడా రాశారు. ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం వైఖరిని ఎండగట్టారు. కేంద్రం దిగిరాకపోతే.. న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా హెచ్చరించారు. 

ఇన్ని జరిగినప్పటికీ.. కేంద్రం మాత్రం కేసీఆర్ విజ్ఞప్తుల్ని పట్టించుకోలేదు. ప్రాజెక్టులపై ఖర్చుపై కూడా 12 శాతం కట్టాల్సిందేనంటూ తేల్చేసింది. మరి ఇప్పుడు బంతి తెలంగాణ సర్కార్ కోర్టులోకి వచ్చి పడింది. తాము డాంబికంగా పలికినట్లుగా కేంద్రం మీద న్యాయపోరాటానికి దిగి, ప్రభుత్వం మీద పడుతున్న 12 వేల కోట్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేసీఆర్ సర్కారు సిద్ధంగానే ఉన్నదా? లేదా, ఏదో ఆరోజున ఆవేశంలో చెప్పేశాం గానీ.. మోడీ సర్కారుతో సున్నం పెట్టుకోవడం ఎందుకు? అనే మెతకవైఖరితో నెమ్మదిగా ఈ విషయాన్ని మరుగున పెట్టేస్తుందా? అనేది తెలియని సంగతి. మరి కేసీఆర్ , మోడీ సర్కార్ పై తొడకొట్టి సవాలు విసరడానికి సిద్ధంగా ఉన్నారో లేదో వేచిచూడాలి.