Home > Politics - Gossip
కొత్త దళారీ వ్యవస్థకు ఇది శ్రీకారం అవుతుందా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక సరికొత్త ఆలోచన చేశారు. దాని బేసిక్ ఆలోచన కొత్తదేమీ కాదుగానీ.. బాబు కొత్త ఎడిషన్ లతో రూపొందించిన 2.0 ఆలోచన అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆయన ఆశించిన ప్రయోజనం కూడా దెబ్బతిని, రాష్ట్రంలో కొత్త దళారీ వ్యవస్థ ఒక ‘లేయర్’లాగా ఏర్పడుతుందేమో అనే భయాలు కలుగుతున్నాయి.

సంక్షేమ పథకాలను రూపొందించడంలో.. వాటిద్వారా పొలిటికల్ మైలేజీని కోరుకోవడం మాత్రమే ఈ ప్రభుత్వాలకు ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. వ్యవస్థ ఎలా సర్వనాశనం అయిపోయినా పర్లేదు.. వ్యక్తి గతమైన ప్రయోజనాలను మాత్రమే సంక్షేమపథకాల రూపంలో కల్పిస్తూ పోతే చాలు.. మన పబ్బం గడుస్తూ ఉంటుంది. ఓట్లు పడుతూ ఉంటాయి... అనే రకంగానే వారు ఆలోచన చేస్తుంటారు. అయితే చంద్రబాబునాయుడు కొత్తగా ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ తమ పార్టీకి రుణపడిపోయి ఉండాలని, అలా రుణపడి ఉండాలనే ఆలోచనను వారిలో నిత్యం ఉంచేలా.. ఒకపార్టీ వ్యవస్థను తయారుచేయాలని ఆలోచిస్తున్నారు.

ఈ కొత్త పద్ధతిలో ‘సాధికార మిత్ర’  పేరుతో తెదేపా కార్యకర్తలను ఎంపిక చేస్తారు. ప్రతి 30ఇళ్లకు ఒక ‘మిత్ర’ పార్టీ తరఫున ఉంటాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వారికి సక్రమంగా అందుతూ ఉన్నాయో లేదో అతను ప్రతిసారీ పరిశీలిస్తూ ఉంటాడు. అంటే రెగ్యులర్ గా వారిని కలిసి పెన్షనొచ్చిందా.. రేషనొచ్చిందా.. మీ పిల్లాడు బళ్లో అన్నం తిన్నాడా.. గుడ్డు పెట్టారా... ఇవన్నీ మా చంద్రబాబే ఇచ్చాడు తెలుసా.. నువ్వు చంద్రబాబుకు రుణపడి ఉండాలి తెలుసా.. అని వారి బుర్రనిండా చంద్రబాబుకు రుణపడి జీవించాలనే ఆలోచనను నింపుతారన్నమాట. ఈ రకంగా ప్రతి ‘మిత్ర’ కూడా వచ్చే ఎన్నికల్లో తన పరిధిలోని 30కుటుంబాల ఓట్లన్నీ తెదేపాకే పడేలా జాగ్రత్త తీసుకోవాలనేది చంద్రబాబునాయుడు ప్లాన్.

అయితే ప్రభుత్వ సంక్షేమపథకాలను కోఆర్డినేట్ చేయడానికి ఈ మిత్రలు ఇళ్లకు తిరుగుతూ.. అవేదో తామే ఇచ్చేస్తున్నట్లుగా ఇప్పించేస్తున్నట్లుగా ఆయా 30కుటుంబాల వారికి బిల్డప్ ఇస్తూ.. అందుకు ప్రత్యుపకారం ఆశించడమూ, ఆ లబ్ధిలో వాటాలు పొందే ఆలోచన చేయడమూ కూడా జరిగే ప్రమాదం ఉంది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేయర్ గా కొత్త దళారీ వ్యవస్థ ఆవిష్కృతం అవుతుంద. ఈ ‘సాధికార మిత్ర’లు ఏమాత్రం గాడితప్పినా.. ఇటు ప్రభుత్వానికి కూడా రాజకీయంగా నష్టం జరుగుతుంది. మరి చంద్రబాబునాయుడు ఈవిషయంలో ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకుని తమ పార్టీ వారికి హెచ్చరికలతో కూడిన శిక్షణ ఇస్తే బాగుంటుంది.