Home > Politics - Gossip
జగన్‌ కౌంటర్‌కి పవన్‌ రిటార్ట్‌.?

'చంద్రబాబు సిట్‌ అంటే కూర్చోవాలి.. స్టాండ్‌ అంటే నిల్చోవాలి.. ఇదే పవన్‌ పని..' అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, పవన్‌కళ్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఏదో అనుకోకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు కావివి. కాస్త ఆలోచించే, వ్యూహాత్మకంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదు. పవన్, చంద్రబాబు చెప్పినట్లు ఎలా ఆడుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. 

రాజధాని అమరావతి ప్రాంతంలోని రైతులు, భూ సమీకరణకు సంబంధించి ప్రభుత్వంపై ఎదురుతిరిగినప్పుడు పవన్‌కళ్యాణ్‌నే ప్రయోగించారు చంద్రబాబు. పవన్‌కళ్యాణ్‌, అక్కడికి వెళ్ళారు.. రైతుల తరఫున నిలబడ్తానని చెప్పి, కన్‌ఫ్యూజ్‌ చేసేసి వచ్చేశారు. అంతే, మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ అటువైపు చూస్తే ఒట్టు. పవన్‌కళ్యాణ్‌ని నమ్ముకున్నందుకు నట్టేట్లో మునిగామని అప్పట్లో ఆయన మీద ఆశలు పెట్టుకున్న రైతులు.. ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. 

చాలా విషయాల్లో పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు చెప్పినట్టే నడచుకున్నారు. బీజేపీని పవన్‌ విమర్శించింది కూడా చంద్రబాబు కనుసన్నల్లోనేనన్న వాదనలూ లేకపోలేదు. ప్రత్యేక హోదా విషయంలో అయితే, పవన్‌ తీరు మొదటినుంచీ అనుమానాస్పదమే. ప్రత్యేక హోదా పేరుతో హడావిడి చేయడం, బహిరంగ సభలు నిర్వహించడం, ఆ తర్వాత సైలెంటయిపోవడం పవన్‌కళ్యాణ్‌కి మామూలే. ఇవన్నీ చంద్రబాబు స్కెచ్‌ ప్రకారమే జరిగాయన్న అనుమానాలు బీజేపీ నేతల్లోంచి వ్యక్తమయ్యాయి కూడా. 

'అవసరమైతే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం..' అని ఆ మధ్య పవన్‌, వైఎస్సార్సీపీతో కలిసి పని చేసే విషయమై వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని జగన్‌ వద్ద తాజాగా ప్రస్తావిస్తే, చిత్తశుద్ధితో ఎవరు ముందుకొచ్చినా, వారితో కలిసి పనిచేస్తామన్నారు. అదే సమయంలో, పవన్‌ని నమ్మడానికి వీల్లేదనేశారు.

మూడేళ్ళ క్రితం పార్టీ పెట్టిన పవన్‌, దాన్ని రాజకీయ పార్టీగా పూర్తిస్థాయిలో నిర్మించడంలో విఫలమయ్యారు. జూన్‌ నాటికి పార్టీ నిర్మాణంపై స్పష్టతనిస్తామంటూ పవన్‌ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడని పవన్‌, అసలంటూ రాజకీయాల పట్ల ఖచ్చితమైన అభిప్రాయాల్లేని పవన్‌ బీజేపీ - టీడీపీయేతర పార్టీలతో కలిసి పనిచేస్తారని ఎలా అనుకోగలం.? 

ఇదిలా వుంటే, జగన్‌ తన మీద చేసిన వ్యాఖ్యలు, వేసిన కౌంటర్లపై పవన్‌కళ్యాణ్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశారట. సోషల్‌ మీడియాలో కౌంటర్‌ ఇవ్వడమా.? లేదంటే మీడియా ముందుకు రావడమా.? అన్నదానిపై పవన్‌, తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. 'సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌..' అంటూ పవన్‌ మీద జగన్‌ వేసిన కౌంటర్‌కి, పవన్‌ నుంచి ఎలాంటి రిటార్ట్‌ వస్తుందో.!