Home > Politics - Gossip
అలా చంద్రబాబుకు మేలు చేసిన జగన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలన చంద్రబాబునాయుడుకు ఒక మేలు జరిగింది. పైకి స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ.. ఇండైరక్టుగా చంద్రబాబును ఒక వర్గం శాశ్వతంగా ద్వేషించకుండా.. చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానమే కరెక్టని అనుకునేలా జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు ఉపకరించాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.

ఏపీలో ఎన్నికల్లో కుల ఓటు బ్యాంకు ప్రకారంగా.. కాపులు చాలా కీలకంగా ఉంటారని అందరికీ తెలుసు. కాపులను ఆకట్టుకోవడానికి నాయకులు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటారు. అలాంటి కాపు వర్గంలో చంద్రబాబునాయుడు పట్ల ఒక వ్యతిరేక భావం కూడా ఉంది. రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదనే కోపం ఉంది. కనీసం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయడానికి కూడా అనుమతించకుండా.. చంద్రబాబు ఘోరంగా వ్యవహరిస్తున్నారని.. కాపుల్లో ఓ అభిప్రాయం ఉంది. అయితే జగన్ స్వయంగా ఇవాళ ఆ దురభిప్రాయాన్ని తుడిచేసినట్లు అయింది.

వైఎస్ జగన్ తాను ప్రజా సంకల్ప యాత్ర చేయదలచుకున్న తరువాత.. ఎంచక్కా డీజీపీ దగ్గరకు తన పార్టీ నాయకులను పంపి అనుమతి కోసం విజ్ఞప్తి ఇచ్చి అనుమతి తీసుకున్నారు. వారు అడిగిన మేరకు అఫిడవిట్లు కూడా ఇచ్చారు. పాదయాత్ర సాగిస్తున్నారు.

ఇన్నాళ్లుగా ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని చంద్రబాబును నిందించేవాళ్ల నోళ్లకు ఇప్పుడు మూత పడింది. కాపు రిజర్వేషన్ కోసం మడమ తిప్పని పోరాటం సాగిస్తున్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ఆయన పాదయాత్ర అంటూ వచ్చారే తప్ప.. అనుమతి అడగరాదా అంటే.. మొండికేస్తూ వచ్చారు.

జగన్ అనుమతి అడిగి తీసుకున్న తర్వాత.. తాను మొండికేయడం ప్రజల్లో తనపట్ల చులకన భావం కలిగిస్తుందే తప్ప.. లాభం లేదని ముద్రగడకు అర్థమైంది. ముద్రగడ పాదయాత్రను నిలువరించడంలో పోలీసులు చేసింది తప్పేమీ కాదని.. జగన్ ను మించిన నేత కాదు కదా.. అనుమతి అడిగితే తప్పేముంది అని ఇప్పుడు పలువురు అనుకుంటున్నారట. అంటే.. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చర్యల వలన, ఇండైరక్టుగా చంద్రబాబునాయుడుకు మేలు జరిగినట్టే కదా.. అని తెలుగుదేశం వర్గాలే మురిసిపోతున్నాయి.