Home > Politics - Gossip
జగన్ మళ్లీ దొరికాడు

జగన్ దురదృష్టమో, చంద్రబాబు అనుకుల మీడియా అదృష్టమో కానీ వైఎస్ జగన్ మళ్లీ దొరికిపోయారు. విశాఖలో హోదా మీద అంత ఉద్యమం జరిగింది. జనం స్వచ్చందంగా వచ్చారు. కానీ ప్రభుత్వం దమన నీతితో దాన్న అణిచేసింది. నిజానికి మర్నాడు మీడియా ఈ వార్తలతో నిండిపోవాలి. కానీ ఏం జరిగింది. జగన్ వెళ్లి అక్కడ పోలీస్ అధికారితో వాదన వేసుకున్నారు. అంతే మొత్తం వ్యవహారాన్ని అటు తిప్పేసారు. ‘ఆ’ మీడియా మొత్తం అటే ఫోకస్ చేసి, అసలు విషయాన్ని చాలా విజయవంతంగా మరుగున పడేసింది.

విజయవాడలో బస్ ప్రమాదం జరిగింది. జగన్ వెళ్లి కలెక్టర్ తో వాదన వేసుకున్నారు. వెంటనే మీడియా దాన్నే అందుకుంది. పోయిన ప్రాణాలు ఎటొ పోనే పోయాయి. దొరికిన జగన్ ను ఎంత బాదేయాలో అంతా బాదేసారు వార్తల్లో.

ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణం. భూమాను ఎంతలా ఇరుకున పెట్టాలో అధికార పార్టీ అంతకు అంతా చేసింది. గత్యంతరం లేక ఆయన అధికార పార్టీలోకి వచ్చారు. ఆయనకు సరిపడని ఫ్యామిలీని తీసుకువచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చో పెట్టారు. మంత్రి పదవి ఇవ్వడానికి దానికి లింక్ పెట్టారు. మరి ఇలా చేసిందంతా ఇప్పుడు కొట్టుకుపోయింది. జగన్ సంతాపం చెప్పలేదన్నది మాత్రం మిగిలిపోతుంది.