Advertisement


Home > Politics - Gossip
బాబుకు ఐడియాలు అందిస్తున్న జగన్ హామీలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ప్లీనరీ సమయం నుంచి, తర్వాత తమ పార్టీలోకి కూడా అధికార తెదేపానుంచి కూడా వస్తున్న వలసలు ఇవన్నీ ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నట్లున్నాయి. 2019 ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే.. ప్రజలకోసం ఏమేం చేస్తానో ఇప్పటినుంచే ఆయన హామీలు ఇచ్చేస్తున్నారు. నవరత్నాలు వంటి పథకాలను ఆయన ఇప్పటికే ప్రకటించారు.

అయితే.. అసలు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. జగన్మోహన్ రెడ్డి తాను తలచుకుంటున్న కీలక హామీలు అన్నిటినీ ప్రజల ముందు పెట్టేయడం అనేది తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందా అనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

తెదేపా చేతుల్లో అధికారం ఇంకా రెండేళ్లపాటు ఉండే నేపథ్యంలో.. జగన్ ఇచ్చిన హామీలను ఈలోగా వారు ఎంగిలి చేసేస్తే.. జగన్ ఆ మంచి అంశాల ఎజెండాలతో  ప్రజల్లోకి వెళ్లే అవకాశం పలచబడుతుంది. ఆల్రెడీ ఇవి చంద్రబాబు చేస్తున్నవే కదా అనే అభిప్రాయం కూడా ప్రజల్లో కొంతమేర కలుగుతుంది. ఆ రకంగా జగన్, తాను ప్రకటిస్తున్న పథకాల ద్వారా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజాదరణ పొందడానికి కొత్త అయిడియాలు సరఫరా చేస్తున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇప్పటికే ప్లీనరీలో ప్రకటించిన మద్యనిషేధం హామీ విషయంలో ఇలాటి స్టెప్ ఒకటి ప్రభుత్వం వైపు నుంచి పడింది. తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యనిషేధం తెస్తానని జగన్ ప్రకటించేసరికి, చంద్రబాబునాయుడు బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్లుగా చట్టంచేసి.. ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ఒకరకంగా జగన్ కు ఒక మైలేజీ పాయింట్ తగ్గిపోయింది. 

ఇప్పుడు నంద్యాల ఎన్నికల ప్రచారం సందర్భంగా.. జగన్ మరో కీలక హామీని బయటపెట్టేశారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచుతా అని... నంద్యాలను కూడా జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని కూడా కార్యరూపంలోకి తెచ్చినా ఆశ్చర్యం లేదు.

పైగా  ఇటీవలే ఓ సారి ఆయన జిల్లాలపెంపు అంశాన్ని గురించి కూడా మాట్లాడారు. ఎటూ అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగడం లేదు గనుక..  కనీసం జిల్లాలు అయినా పెంచితే.. తాను కూడా ఏదో ఒక పనిచేసినట్లుగా ఉంటుందని ఆయన ఈ నిర్ణయం రాబోయే ఏడాదిలో తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ రకంగా జగన్ తన హామీల ద్వారా చంద్రబాబునాయుడు కు ఐడియాలు ఇస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.