Advertisement


Home > Politics - Gossip
జగన్‌ ఈ నిర్ణయం రైటేనా...?

మొత్తానికి బీఎన్‌ఆర్‌ బ్రదర్స్‌ తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయినట్టే. ఈ మేరకు అనంతపురం టౌన్లో పచ్చ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలుగుదేశంలోని కొంతమంది బీఎన్‌ఆర్‌ సోదరులకు స్వాగతం పలుకుతున్నట్టుగా పోస్టర్లు వేయించారు. అయినా బీఎన్‌ఆర్‌ ఇప్పుడు లేరు. ఆల్రెడీ చనిపోయారు ఆయన. అయితే ఆయన సోదరుడు అయిన మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, బీఎన్‌ఆర్‌ మరో సోదరుడిని తెలుగుదేశంలోకి చేర్చుకున్నట్టేనేమో. ఇందుకు సంబంధించి టీడీపీలో లొల్లి కొనసాగుతోంది.

తెలుగుదేశంలోని కొంతమంది వీరి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఇక పెద్దతలలు మాత్రం ఈ వ్యవహారంపై నోరు విప్పలేదు. జేసీ దివాకర్‌రెడ్డి అయితే గురునాథరెడ్డి చేరికపట్ల హ్యాపీగా ఉన్నాడు. ఎలాగైనా అనంతపురం అర్బన్‌ తెలుగుదేశం టికెట్‌ను గురునాథ్‌ రెడ్డికే ఇప్పించాలనేది జేసీ ఆశ. అయితే తెలుగుదేశంలో ఈ రెడ్ల హవా ఎంతవరకూ ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం నిస్సందేహంగా అక్కడ లొల్లినే పుట్టిస్తోంది. నియోజకవర్గంలో ఆదిపత్యపోరు తప్పదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండగా.. ఓడిపోయిన వ్యక్తిని తెచ్చుకోవడం అంటే.. అది తెలుగుదేశం పార్టీ బలహీనతే అనుకోవాలి. ప్రతిపక్ష పార్టీ నుంచి నేతలు వచ్చిచేరితే ఆ పార్టీ బలహీన పడిపోతుందన్న లెక్కతో మాత్రమే.. తెలుగుదేశం ఇలా చేస్తోంది. ఆఖరికి మాజీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుని తన తోకకు తనే నిప్పు పెట్టుకుంటోంది తెలుగుదేశం పార్టీ. టికెట్‌ భరోసా లేకుండా, టికెట్‌ దక్కుతుందన్న ఆశ ఏమాత్రం లేకుండానే గురునాథరెడ్డి చేరి ఉండకపోవచ్చు. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఇదే విషయంలో వైకాపా అధినేత లెక్కేమిటనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. గురునాథరెడ్డిని జగన్‌ మరీ ఇంత తేలికగా ఎలా తీసుకున్నాడు? అనేది ప్రశ్నార్థకమైన అంశం. ఎంతైనా జగన్‌ కోసం అప్పట్లో అధికార పార్టీని వదులుకుని వచ్చిన వ్యక్తి గురునాథరెడ్డి. అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం అంటే.. ఇది ఒకింత పొరపాటే అని వేరే చెప్పనక్కర్లేదు.

ఇక్కడే మరో విషయం ఏమిటంటే.. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం పరిస్థితి ప్రకారం చూసుకుంటే.. అక్కడ వైకాపా తరఫున 'రెడ్డి' సామాజికవర్గం వ్యక్తి పోటీచేయడం సామాజికవర్గ సమీకరణాల లెక్క ప్రకారం చాలా అవసరం కూడా. అనంతపురం టౌన్లో రెడ్ల జనాభా గణనీయంగా ఉంటుంది. ఈ సామాజికవర్గంలో ఆర్థికంగా స్థితిమంతం అయిన వారితో పాటు... వ్యాపారాలు గట్రా చేసుకునే వాళ్లు, చుట్టుపక్కల పల్లెల భూస్వాములు ఇలా అంతా.. వరసపెట్టి అనంతపురం టౌన్‌ చేరుకున్నారు. ఇక ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు కూడా అనంతపురమే వేదిక.

ఈ సమీకరణాల ప్రకారం రెడ్ల ఓట్ల సంఖ్య టౌన్లో వేలసంఖ్యలో ఉంది. గత చరిత్రను చూసినా.. అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో వరసపెట్టి రెడ్లే గెలిచిన వైనాన్ని గమనించవచ్చు. గత ఎన్నికల్లో అనంతపురం టౌన్‌ నుంచి అసెంబ్లీకి చౌదరి గెలిచాడు కానీ.. అంతకు ముందు గురునాథరెడ్డి రెండుసార్లు, వీళ్ల అన్న నారాయణ రెడ్డి రెండుసార్లు విజయం సాధించిన నేపథ్యం ఉంది. జనాభా పరంగా తీసుకున్నా, నేపథ్య పరంగా తీసుకున్నా టౌన్‌ టికెట్‌ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం చాలానే ఉంది. అయితే.. జగన్‌ మాత్రం డిఫరెంట్‌ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు.

జిల్లాకు ఒక సీటును ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలనే తన నిర్ణయం మేరకు అనంతపురం అర్బన్‌ను ముస్లిం అభ్యర్థికి కేటాయించాడు. అయితే.. ముస్లిం అభ్యర్థికి కదిరి నియోజకవర్గం సరైనది అయ్యేది. గత ఎన్నికల్లో కదిరిలో ముస్లిం అభ్యర్థికి టికెట్‌ ఇచ్చాడు జగన్‌. అతడు గెలిచాడు. ఫిరాయించడం వేరే సంగతి కానీ.. కదిరి నుంచి మరో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేసుకుని ఉంటే అది మంచి వ్యూహం అయ్యేది. ఇక హిందూపురం కూడా ముస్లిం అభ్యర్థికి తగిన నియోజకవర్గమే కానీ.. అక్కడ నవీన్‌ నిశ్చల్‌ రూపంలో గట్టి అభ్యర్థి ఉండటంతో.. అనంతపురం అర్బన్‌ సీటునే ముస్లిం అభ్యర్థికి కేటాయిస్తున్నట్టుగా ఉన్నాడు జగన్‌ మోహన్‌రెడ్డి. మరి ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.