Home > Politics - Gossip
భళా.. భలే ఛాన్సు అనుకుంటున్న కళా!

‘‘దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా ఎంచేవారికి భలేచాన్సులే...’’ అంటూ గతంలో ఓ సినీకవి పాటలో ప్రవచించారు. ఇప్పుడు ఏపీలోని మంత్రి మరియు తెలుగుదేశం పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే నిజమే అనిపిస్తుది. ఏపీలో తెదేపా పార్టీ పరిస్థితి మునిగిపోయే నావ లాగున్నదయ్యా అని తోటి రాజకీయ నాయకులు జోస్యం చెబుతోంటే.. అందులోంచి అసలు పాయింటును వదిలేసి.. అవే సర్వేలను ఆధారంగా చేసుకుని.. మేం ఈసారి ఎన్నికల్లో వెలిగిపోబోతున్నాం.. అని అనడం అంటే.. అమాయకత్వం కాక ఇంకేం అనుకోవాలి. 

తెదేపా అధ్యక్షుడు కళా వెంకటరావు అలాంటి అమాయకత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఏపీలో 140 సీట్లు వస్తాయని ఆయన అంటున్నారు. ఏ లెక్కల ఆధారంగా ఇలా సెలవిస్తున్నారు సార్ అనడిగితే.. కేసీఆర్ చేయించిన సర్వే ఆధారంగా అని ఆయన అంటుండడమే అసలు కామెడీ. ఎందుకంటే.. ఆ నడుమ కేసీఆర్ ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి కూడా ముచ్చటించారు. ఈసారి ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పారు. తెలుగుదేశం పరిస్థితి ఆ రాష్ట్రంలో కూడా చాలా దయనీయంగా ఉన్నదని సెలవిచ్చారు. 

ఇదంతా ఒక మిత్రుడు చేయించిన సర్వే వివరాల ఆధారంగా చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక రకంగా ఆయన మాటలు తెలుగుదేశానికి ప్రమాద ఘంటికలు అని భావించాలి. అయితే ఆయన చేసిన హెచ్చరికలేమీ.. ఈ పార్టీ అధ్యక్షుడికి కనిపించినట్లు లేదు. గత ఎన్నికల కంటె.. తెలుగుదేశానికి 2019లో ఒకశాతం ఓట్లు పెరగతాయని కేసీఆర్ జోస్యం చెప్పాడు గనుక.. తమకు సీట్లు పెరుగుతాయనే భ్రమలో కళా వెంకట్రావు ఉన్నట్లుంది. నిజానికి కేసీఆర్ వీరికంటె ఎక్కువ శాతం ఓట్లు వైకాపాకు వస్తాయని కూడా చెప్పారు. 

మరి వీరికే 140 సీట్లు వస్తే... వైకాపాకు 180-200 సీట్లయినా రావాలి కదా! అని జనం కళా మాటలు విని నవ్వుకుంటున్నారు. దక్కే సీట్ల సంగతి తర్వాతి విషయం గానీ.. కళా మాటల ద్వారా ఓ కబురు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు అనేది మాత్రం జరగదు. అలాంటి ఆశలు పెట్టుకుని.. తెదేపాలో కొనసాగుతున్న వారెవరైనా ఉంటే తట్టా బుట్టా సర్దుకోవడం మంచిది అనే సంకేతాలు అందుతున్నాయి.