Advertisement


Home > Politics - Gossip
కాపు రిజర్వేషన్‌: బీజేపీకి సంబంధం లేదా.?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కాపు రిజర్వేషన్‌ బిల్లుకి ఆమోదం తెలిపింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, మూడున్నరేళ్ళ తర్వాత చంద్రబాబు కాపు రిజర్వేషన్‌పై కీలకమైన ముందడుగు వేశారు. అదీ, కాపు రిజర్వేషన్‌ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వకుండానే. కమిటీ ఛైర్మన్‌ నివేదిక ఇవ్వకపోయినా, సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారంటూ, చంద్రబాబు సర్కార్‌ 'నీతి బాహ్యమైన' వాదన విన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం. 

బంతి ఇప్పుడు కేంద్రం కోర్టుకి వెళ్ళింది. మామూలుగా అయితే, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించిన బిల్లుకి కేంద్రంలో పెద్దగా ఇబ్బందులు వుండకూడదు. ఎందుకంటే, ఇక్కడా అక్కడా అధికారంలో వున్నది టీడీపీ - బీజేపీ కలిసి నడుపుతున్న ప్రభుత్వాలే. ఏపీలో టీడీపీ అధికారంలో వుంటే బీజేపీ మిత్రపక్షం. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంటే టీడీపీ మిత్రపక్షం. సో, కాపు రిజర్వేషన్‌ బిల్లుకి కేంద్రం నుంచి అభ్యంతరాలుండకూడదు. 

కానీ, 'పార్టీలో చర్చిస్తాం..' అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు బీజేపీ సీనియర్‌ నేత సోము వీర్రాజు కాపు రిజర్వేషన్ల వ్యవహారంపై. 'అది మంచిదా.? కాదా.?' అని నేను మాట్లాడను, 'పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత మాట్లాడతాను..' అంటున్నారాయన. అంటే, ఇక్కడ బీజేపీకి ఇష్టం లేకుండానే అసెంబ్లీలో కాపు రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిందని అనుకోవాలేమో.! 

టీడీపీ - బీజేపీ పొత్తుకు సంబంధించి బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌ అంటే సోము వీర్రాజు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఇప్పటిదాకా మేం కలిసే వున్నాం..' అని అంటున్నారే తప్ప, మిగిలిన ఏడాది కూడా కలిసే వుంటామన్నమాట ఆయన నోట రాకపోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్‌ వివాదంపై స్పందించిన సోము వీర్రాజు, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌ని కేంద్రం తీసుకోబోదని తెగేసి చెప్పారు. 'చంద్రబాబు ఇచ్చేస్తానంటే కుదరదు.. చంద్రబాబు మీద నమ్మకం వుంది..' అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపాయి. 

2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ గెలిచినప్పటినుంచి ఇప్పటిదాకా.. ఆ రెండు పార్టీల మధ్యా విడతల వారీగా వివాదాలు తెరపైకొస్తున్నాయి.. చంద్రబాబు గుస్సా అవడం, టీడీపీ నేతలు రెచ్చిపోవడం.. ఆ తర్వాత బీజేపీ నుంచి కౌంటర్‌ రావడం.. షరామామూలుగానే టీడీపీ 'తోక ముడిచేయడం' సర్వసాధారణమైపోయింది. ఇంతకీ, కాపు రిజర్వేషన్‌ విషయంలో సోము వీర్రాజు అనుమానాలు నిజమేనా.? కేంద్రం నుంచి కాపు రిజర్వేషన్‌ బిల్లు వెనక్కి వచ్చేస్తుందా.? వచ్చేలానే వుంది. అదే గనుక జరిగితే, బీజేపీ - టీడీపీని ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా దెబ్బకొట్టేసినట్టే అవుతుంది.