Home > Politics - Gossip
కర్నూలు జిల్లాలో మరో ఉపఎన్నిక.. టీడీపీలో పోటాపోటీ!

మొత్తానికి కర్నూలు జిల్లాలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. ఇది కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నిక. ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యం అయ్యింది. పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిందే.. అనే నైతికతకు  తగ్గట్టుగా చక్రపాణి రెడ్డి రాజీనామా చేశాడు. ఆ రాజీనామా నంద్యాల బైపోల్‌కు ముందే ఆమోదం పొందింది. మరి రానున్న ఆరు నెలల్లోగా ఎన్నికల కమిషన్‌ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీటు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. మరి ఈ సీటుకు తెలుగుదేశం పార్టీలో ఆశావహుల జాబితా చాలా పెద్దగానే కనిపిస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికలో తాము కష్టించి పనిచేశాం కాబట్టి.. తమకు అవకాశం ఇవ్వాలని చాలామంది డిమాండ్‌ చేస్తున్న పరిస్థితి అగుపిస్తోంది. ఈ జాబితాను తయారు చేస్తే... వీరిలో చాలామంది ఉంటారు. ఎస్పీవై రెడ్డి అల్లుడు, ఏవీ సుబ్బారెడ్డి, గంగుల వంటి వారితో పాటు.. పార్టీలోకి చేరతాను అని సంకేతాలు ఇస్తున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఈ స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నాడని సమాచారం. నంద్యాల్లో పార్టీని గెలిపించుకోవడానికి అవిశ్రాంతంగా పని చేశామని.. సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, గంగుల వంటి వాళ్లు.. చెప్పుకొంటున్నారు. తమ వల్లనే తెలుగుదేశం అభ్యర్థి గెలిచిందని వారు చెబుతున్నారు. కాబట్టి ఎమ్మెల్సీగా తమకు అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు.

ఇక బైరెడ్డి ప్రతిపాదన కూడా అదేనట.. తనకు ఆ ఎమ్మెల్సీ సీటును ఇస్తే.. తను తెలుగుదేశంలో చేరతాను అని అంటున్నాడట. ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. మరి వీరిలో బాబు ఎవరికి అవకాశం ఇస్తాడు? అనేది ఆసక్తిదాయకమైన అంశం.

బలం వైసీపీకే.. మళ్లీ టీడీపీనే గెలుస్తుందా?

స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలప్పటి ఫలితాల ప్రకారం.. ఈ సీటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందాలి. అయితే స్థానిక సంస్థల సభ్యుల ఫిరాయింపులు, ధన రాజకీయం నేపథ్యంలో.. ఇక్కడ క్రితంసారి తెలుగుదేశం పార్టీ తరపున శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించాడు. వైకాపా తరపు నుంచి గౌరు వెంకటరెడ్డి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో బాబు తెచ్చిన ఒత్తిడితోనే భూమా నాగిరెడ్డి మరణించాడని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకూ అప్పుడు తెలుగుదేశం గెలిచింది. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం.

ఓటు హక్కు ఉన్న వాళ్ల పంట పండినట్టే..!

ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారి పంట పండినట్టే. కర్నూలు జిల్లా వాళ్లకు ఈసారి మరోసారి జాక్‌పాట్‌ తగలనుంది. ఎలాగూ వైకాపా సభ్యులు మెజారిటీ.. తెలుగుదేశం ఈ  సీటును సొంతం చేసుకోవాలని అనుకుంటోంది. సో.. ప్రతి ఓటుకూ ఒకరేటు కట్టడం ఖాయం. కోట్ల రూపాయల ధనప్రవాహం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ విధంగా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల సభ్యులకు డబుల్‌ జాక్‌పాట్‌ తగలబోతోంది. ఇది వరకే వాళ్లందరికీ తలా కొంత ముట్టచెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు అంటే.. వాళ్లకు డబుల్‌ పేమెంట్సే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ బైపోల్‌లో శిల్పా చక్రపాణి రెడ్డే పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.