Home > Politics - Gossip
కేసీఆర్‌ని వణికిస్తున్న 'మొనగాడు'

కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకే సాధ్యం కాలేదు.. తెలంగాణలో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్‌ పార్టీకి అంత సీన్‌ లేనే లేదు. తెలుగుదేశం పార్టీ సంగతి సరే సరి. ఇంకెవరు.? తెలంగాణలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే మొనగాడెవరు.? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. అదే, ప్రొఫెసర్‌ కోదండరామ్‌. 

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా కోదండరామ్‌, తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారంటే దానిక్కారణం కేసీఆర్‌. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కోదండరామ్‌ని తెరపైకి తెచ్చింది కేసీఆర్‌ అయినా, ఈ క్రమంలో కేసీఆర్‌, జానారెడ్డి సూచన మేరకు వ్యవహరించారన్నది నిర్వివాదాంశం. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌ కంటే కాస్తో కూస్తో క్రేజ్‌ కోదండరామ్‌కే ఎక్కువగా కన్పించింది. కోదండరామ్‌ పేరు తెలంగాణలో మార్మోగిపోయింది అప్పట్లో. 

తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి, రెండ్రోజులు గడవకముందే నిరాహార దీక్షను కేసీఆర్‌ విరమిస్తే, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినదించింది. ఆ దెబ్బకి కేసీఆర్‌ భయపడ్డారు, మళ్ళీ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పడిపోయిన కేసీఆర్‌ గ్రాఫ్‌ పెరిగిందంటే దానిక్కారణం కోదండరామ్‌ మాత్రమే. కానీ ఏం లాభం.? తనకంటే ఇమేజ్‌ పెంచేసుకుంటున్నారన్న అక్కసుతో కోదండరామ్‌పై విషం చిమ్మారు కేసీఆర్‌. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌, కోదండరామ్‌ని మరింతగా దూరం పెట్టడం షురూ చేశారు. మరోపక్క, తెలంగాణ వచ్చినా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కారణంగా మేలు జరగడంలేదని ఆరోపిస్తూ కోదండరామ్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మీద 'యుద్ధం' ప్రకటించారు. మల్లన్నసాగర్‌ విషయంలో కోదండరామ్‌ దెబ్బకి, కేసీఆర్‌ సర్కార్‌ బెంబేలెత్తిందని చెప్పక తప్పదు. చాలా విషయాల్లో కోదండరామ్‌ని కంట్రోల్‌ చేయలేని స్థితిలో వుందిప్పుడు కేసీఆర్‌ సర్కార్‌. 

దాంతో, కోదండరామ్‌ ఇమేజ్‌ని ఎక్కడికక్కడ డైల్యూట్‌ చేయడానికి కేసీఆర్‌ సర్కార్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా, అమరవీరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనేందుకు నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి వెళ్ళేందుకు కోదండరామ్‌ ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నాన్ని నీరుగార్చారు పోలీసులు. మార్గమధ్యంలోనే కోదండరామ్‌ని అరెస్ట్‌ చేయడం గమనార్హం.

తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందనీ, యాత్రకి అనుమతివ్వని పోలీసులు, ఓ మీటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతున్న తనను అరెస్ట్‌ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారాయన. అయితే, కోదండరామ్‌ యువతను, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కేసీఆర్‌ సర్కార్‌ వాదన. ఎవరేమనుకున్నా, తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూనే వుంటానని కోదండరామ్‌ తెగేసి చెబుతున్నారు. 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీల వెన్ను విరిచేయగలిగిన కేసీఆర్‌, కోదండరామ్‌ విషయంలోనే ఏ ప్రయత్నం చేసినా బెడిసికొట్టేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కోదండరామ్‌ ఒక్కరే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వెన్నులో వణుకుపుట్టించగలుగుతున్నారన్నమాట.