Advertisement


Home > Politics - Gossip
కేసీఆర్ ఆత్రుత ‘ముందస్తు’కు చిహ్నమా?

నేటినుంచి 15నెలలకు సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కొన్నినెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో కేంద్ర  ప్రభుత్వం ఉన్నట్లు తనకు సంకేతాలు అందాయని, అదే ఎన్నికల సమయానికి మనం కూడా సంసిద్ధం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. తన పార్టీ శ్రేణులకు ఉద్బోధించినట్లుగా మూడురోజుల కిందట వార్తలు వచ్చాయి.

ఇప్పుడు కేసీఆర్.. సిద్ధం చేసుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక... ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండేలా పార్టీ నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టడం, ఈ ఏడాదిలో సింహభాగం పార్టీ నిర్మాణం మీదనే ఎన్నికల కసరత్తు మీదనే దృష్టి పెట్టేలా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తిగా పార్టీ నిర్మాణానికే శ్రద్ధ పెడుతున్నట్లు ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీనుంచి సమాచారం రాబట్టడంలో బలమైన నెట్ వర్క్ ఉన్న కేసీఆర్ ప్రస్తుతం పార్టీపై కనబరుస్తున్న ఆత్రుతను గమనించినప్పుడు.. ఈ ఏడాదిలో ముందస్తు ఎన్నికలు తప్పవా అనే అభిప్రాయం కలుగుతోంది.

తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి, ఏపీలో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశానికి రెండు మౌలికమైన తేడాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ ఛిన్నాభిన్నం అయి శిథిలమైపోయింది గానీ.. ఏపీలో వారి మూలస్తంభాలు ఇంకా అంతే పటిష్టంగా ఉన్నాయి.

పైగా ఇప్పుడు అధికారంలో కూడా ఉన్నారు గనుక.. ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలోని పార్టీ నెట్వర్క్ కు ప్రయోజనాలు చేకూరుస్తూ వారిని పార్టీకి కట్టుబడి ఉండేలా చేసుకోవడంలో తెలుగుదేశం సక్సెస్ అవుతోంది. తెరాస పరిస్థితి వేరు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే.. ఉద్యమ ఆవేశంలో ప్రజల ఆదరణ వెల్లువెత్తడంతో వారు చాలా సునాయాసంగా అధికారంలోకి వచ్చారు.

అధికారాన్ని అనుభవించడమూ, ప్రభుత్వ పథకాల ప్రచారం చేసుకోడం మీదనే దృష్టిపెడుతూ వచ్చారు తప్ప పార్టీ సంస్థాగత నిర్మాణం పట్టించుకోలేదు. కేసీఆర్ గద్దె ఎక్కాక ప్రతి పార్టీ ప్లీనరీలోనూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు తప్ప.. ఈ నాలుగేళ్లలో వారికి అందుకు సమయం చిక్కలేదు. కానీ ఇప్పుడు ఆయన వేగిరపడుతున్నారు. పంచాయతీల స్థాయి వరకు పార్టీ కమిటీలు.. నెట్వర్క్ బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యమని ఆయన గ్రహించినట్లుగా ఉంది.

పార్టీ ఎమ్మెల్యేలు లేని 39నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం ఇన్ఛార్జిలు కూడా లేరంటే.. ఎంత గాలివాటుగా పార్టీని నడుపుతున్నారో అర్థం అవుతుంది.  ఈ లోపాలన్నీ చక్కబెట్టేయడానికి కేసీఆర్ ఏప్రిల్ నుంచి పూర్తి సమయం కేటాయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పార్టీ బలోపేతం కావడానికి ఉపయోగపడవచ్చు గానీ.. ఆ తొందర గమనిస్తోంటే మాత్రం.. ముందస్తు ఎన్నికలు తప్పవేమో అని అందరూ అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది.