Advertisement


Home > Politics - Gossip
కోదండరామ్‌ 'స్థాయి' ఏంటి.?

'కొలువుల కొట్లాట' పేరుతో తెలంగాణ జేఏసీ భారీ బహిరంగ సభను హైద్రాబాద్‌లో నిర్వహిస్తోంది. తెలంగాణ నడిబొడ్డున (హైద్రాబాద్‌కి శివారులోనే అయినా..) జరుగుతున్న ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 'గట్టి సంకేతం' ఇవ్వాలన్నది తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఆలోచన. నిజానికి, ఈ బహిరంగ సభ ఇప్పటికే జరిగి వుండాలి. తెలంగాణ ప్రభుత్వం, అనుమతుల విషయంలో ముప్పుతిప్పలు పెట్టేయడంతో.. కోర్టుకి వెళ్ళి మరీ, అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది. 

2014 ఎన్నికలకు ముందు.. కోదండరామ్‌ - కేసీఆర్‌ 'దోస్తీ' గురించి కొత్తగా చెప్పేదేముంది.? కోదండరామ్‌ మీద ఈగవాలితే ఊరుకునేది లేదని కేసీఆర్‌ అప్పట్లో తెగేసి చెప్పేవారు. తెలంగాణ జేఏసీ స్థాపనలో కేసీఆర్‌ కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? కోదండరామ్‌కి ఇప్పుడీ పొలిటికల్‌ స్టార్‌డమ్‌ తెలంగాణలో వచ్చిందంటే, దానికి కారణం కేసీఆర్‌ అన్నది నిర్వివాదాంశం. కానీ, 2014 ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్‌ మారిపోయాయి. 

కేసీఆర్‌ చెప్పిన ప్రతి మాటకీ కోదండరామ్‌ తలాడించి వుంటే, తెలంగాణలో ఇప్పుడు కోదండరామ్‌ ఇమేజ్‌ ఇంకోలా వుండేది. చట్ట సభల్లో ముఖ్యమైన పదవిలో అయినా వుండి వుండేవారు.. లేదంటే, కీలకమైన 'సలహాదారు' అనే బాధ్యతలో అయినా కోదండరామ్‌ వుండి వుండేవారే.! తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే కొన్ని విషయాల్లో కేసీఆర్‌తో కోదండరామ్‌ విభేదించారు. దాంతో, వ్యూహాత్మకంగా కేసీఆర్‌, కోదండరామ్‌ని పక్కన పెట్టారు. 

మొన్నామధ్య మల్లన్నసాగర్‌ వ్యవహారం.. ఇప్పుడు కొలువుల కొట్లాట.. వెరసి, కేసీఆర్‌ సర్కార్‌కి కోదండరామ్‌ 'పంటికింద రాయి'లా మారిపోయారనడం అతిశయోక్తి కాదేమో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోదండరామ్‌, 'వారి స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను..' అంటూ తన మీద విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, టీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటర్‌ ఇచ్చారు. 

'కాంగ్రెస్‌ పార్టీని నేను కలవడం తప్పయితే, కేసీఆర్‌ - సోనియాగాంధీని కుటుంబ సమేతంగా కలవడం తప్పు కాదా.?' అని ప్రశ్నించిన కోదండరామ్‌, ఫలానా పార్టీని ఎవరన్నా కలవడం నేరమయినప్పుడు, ఆయా రాజకీయ పార్టీల్ని రద్దు చేసెయ్యండని కూడా కేసీఆర్‌కి కౌంటర్‌ ఇచ్చేశారు. వ్యవహారం 'స్థాయిల' గురించిన చర్చదాకా రావడం విశేషమే మరి. 

ఏదిఏమైనా, కోదండరామ్‌ ఆశించిన స్థాయిలో 'కొలువల కొట్లాట' విజయవంతమైతే, కోదండరామ్‌ తన 'స్థాయి'ని మరింత పెంచుకున్నట్లే అవుతుంది. ఎటూ, తెలంగాణలో నిరుద్యోగ సమాజం తీవ్ర అసంతృప్తితో వున్న దరిమిలా.. 'కొలువుల కొట్లాట' అంచనాల్ని మించి విజయవంతమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!