Home > Politics - Gossip
సీఎం స్థాయి పనులన్నీ కేటీఆర్ పూచీనేనా?

సాధారణంగా ప్రభుత్వ నిర్వహణలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటివి కొన్ని కీలక కార్యక్రమాలు చేపట్టేప్పుడు ఒకస్థాయి తగినట్లుగా చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపేవి... భారీస్థాయిలో జరిగేవి అయితే.. సాధారణంగా ముఖ్యమంత్రి స్వయంగా ఆయా పనులు తన చేతుల మీదుగా నడిపిస్తుంటారు. కొంచెం చిన్నస్థాయి పనులైతే.. ఆయా శాఖలకు చెందిన మంత్రులతోనే శ్రీకారం చుట్టించేస్తూ ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే.. పని చిన్నది పెద్దది అనే నిమిత్తం లేకుండా.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రతి దానిలోనూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. చిన్న కార్యక్రమాలు అయినా తానే రిబ్బను కత్తిరిస్తూ, టెంకాయ కొడుతూ ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం పూర్తిగా భిన్నం. సాధారణంగా సీఎం స్థాయిలో జరగుతాయని అంతా అనుకునే చాలా కార్యక్రమాలు శాఖలతో నిమిత్తం లేకుండా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడినే తనకు ప్రత్యామ్నాయంగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం జరుగుతున్నదని అభిప్రాయాలు ఇక్కడ తరచుగా కలుగుతూ ఉంటాయి. 

త్వరలోనే హైదరాబాదులో మెట్రోరైలు ప్రారంభం కాబోతున్నది. దీనిని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఉన్నతస్థాయిలో ట్రయల్ ప్రయాణాన్ని బుధవారం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ స్వయంగా ఈ మెట్రోరైలులో ప్రయాణించి చూశారు. అయితే ఇలాంటి కార్యక్రమంలో గవర్నర్ తో పాటూ ముఖ్యమంత్రి ఉంటారని అనుకోవచ్చు. ఆయన వెంట కేటీఆర్ మెట్రోను విజిట్ చేశారు. సీఎం రేంజి కార్యక్రమాలకు.. ఆయనకు సమయం లేకపోతే... కేటీఆర్ వస్తుంటారన్నట్లుగా అంతా అనుకుంటున్నారు. 

తెలంగాణలో ఇది మొదలుకాదు. గతంలోనూ భారీసంఖ్యలో పక్కా ఇళ్లకు శంకుస్థాపన వంటి కీలక కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా.. కేటీఆర్ చేతుల మీదుగానే వాటిని నిర్వహించారు. సీఎం స్థాయి కాదనుకుంటే.. కనీసం ఆయా శాఖల మంత్రులకు చాన్సు ఇవ్వవచ్చు. కానీ అలా కూడా కాకుండా, కేటీఆర్ ద్వారా జరిపించడం అనేది తొలినుంచి కేసీఆర్ జమానా వ్యూహంగా కనిపిస్తోంది.

గతంలో అయితే.. కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరికి దక్కుతుంది..? అనే మీమాంస గురించి రకరకాల ఊహాగానాలు ఉండేవి. అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్ లలో వారసత్వం ఎవరికి అనే చర్చ ఉండేది. ఇప్పుడు క్రమంగా ఆ చర్చ మరుగున పడిపోయింది. నెంబర్ టూ అంటే కేటీఆర్ మాత్రమే అనే వాదన తెరాసాలో బలపడుతోంది. నిజానికి పార్టీ మొత్తం ఆ భావనకి అనుగుణంగానే ట్యూన్ అవుతున్న వాతావరణం ఉన్నదని పలువురు అంటున్నారు.