Advertisement


Home > Politics - Gossip
'కుట్ర' నిజమేనా.? తేడా కొట్టేస్తోందే.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద 'భౌతిక దాడి' జరగబోతోందట. ఆ దిశగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఇదంతా 'ఓ పద్ధతి ప్రకారం' జరుగుతున్న వ్యవహారమట. 'నడిరోడ్డుపై కాల్చేసినా తప్పు లేదు.. ఉరి శిక్ష వేసినా అది తక్కువే..' అంటూ వైఎస్‌ జగన్‌ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలనుంచి ఈ తరహా కొత్త అర్థాల్ని తెరపైకి తీసుకొస్తోంది తెలుగుదేశం పార్టీ. 

నిజానికి, ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తిపై ఈ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం సబబు కాదు. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రస్తుతం రాజకీయాలెలా వున్నాయి.? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 'నీ అంతు చూస్తా..' అని అసెంబ్లీ సాక్షిగా అంటే తప్పు లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అసెంబ్లీలోనే ప్రతిపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'పాతేస్తా నా డాష్‌ డాష్‌' అంటే తప్పు లేదు.! ఎందుకంటే, అధికార పార్టీ గనుక ఏమైనా అనొచ్చన్నమాట. 

మన దేశంలో అంటే, ఉరిశిక్ష పడాలంటే అదో పెద్ద ప్రసహనం. కొన్ని దేశాల్లో అలా కాదు. చిన్న చిన్న నేరాలకీ మరణ శిక్షలుంటాయి. స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ఏ శిక్ష వేస్తే తక్కువ.? అన్న అర్థం వచ్చేలా 'నడి రోడ్డుపై కాల్చినా తప్పు లేదు..' అన్న మాట జగన్‌ అని వుండొచ్చుగాక. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కి, ప్రజల్ని మోసగించినందుకుగాను 'ఉరి శిక్ష వేసినా తక్కువే..' అన్న మాట జగన్‌ అంటే అది తప్పెలా అవుతుందట.! 

'కాల్చి పారెయ్యాలి..' అన్న మాట జగన్‌ ఏ సందర్భంలో ఉపయోగించారు.? ఉరి శిక్ష వేసినా తక్కువేనని జగన్‌ ఎందుకు అంటున్నారు.? ఆయా సందర్భాల నేపథ్యం గురించి ఆలోచించకుండా, నిజంగానే జగన్‌ వైపు నుంచి కుట్రలు షురూ అయ్యాయనీ, చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వుందనీ టీడీపీ ప్రచారం చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు.

ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల భద్రత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఎదుర్కోలేక, ఎమ్మెల్యే రోజా సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

అధికారంలో వున్నది తెలుగుదేశం పార్టీ. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ మొత్తం తమ కనుసన్నల్లో నడుస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి మీద కుట్ర.. అంటూ అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేయడం హాస్యాస్పదమే. ఆ ఆరోపణలే నిజమైతే, ప్రభుత్వ వ్యవస్థను సక్రమంగా నడిపించలేని అచేతనావస్థలో చంద్రబాబు సర్కార్‌ వున్నట్లే కదా.!