Home > Politics - Gossip
లోకేష్‌తో టీడీపీకి లాభమెంత.?

'కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జాతీయ స్థాయిలో లోకేష్‌కి 'ఇమేజ్‌' తీసుకొచ్చేద్దామనుకుని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేశారాయన. కానీ, ఆ పదవిలో 'చినబాబు' ఒరగబెట్టిందేమీ లేదు. పైగా, తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసేశాడన్న ఆరోపణలు 'బోనస్‌'గా లభించేశాయి. 

ఎలాగైతేనేం, నారా లోకేష్‌ మంత్రి అయిపోయారు. ఇకనేం, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదంటూ పార్టీ నేతలతో చంద్రబాబు చెప్పించేశారు. ఇంకా ఆ భజన అలాగే కొనసాగుతోందనుకోండి.. అది వేరే విషయం. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇటీవలే లోకేష్‌ని కాబోయే ముఖ్యమంత్రి.. అంటూ ఉబ్బేశారు. మరికొందరు టీడీపీ నేతలూ ఇదే పాట పాడుతుండడంతో, లోకేష్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ఇంతకీ, 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనుకోవచ్చా.? అంటే, లేదాయె.! లోకేష్‌ మంత్రి అవ్వడమంటే తేలిగ్గానే జరిగిపోయిందిగానీ, మంత్రికి వుండాల్సిన హుందాతనం, మంత్రిగా చూపించాల్సిన మాటకారితనం.. ఇవేవీ ఆయనలో కన్పించడంలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ టీడీపీలోనే కొందరు ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు.. మీడియాకి లీకులూ అందిస్తున్నారు. ఆనోటా, ఈనోటా ఈ వ్యాఖ్యలు చినబాబుదాకా వెళ్ళకుండా వుంటాయా.? 

అంబేద్కర్‌ జయంతికీ, వర్దంతికీ తేడా తెలియకుండా వ్యవహరించడం, తాగునీటి సమస్యను సృష్టిస్తాననడం.. ఇలా చినబాబు 'అనుభవలేమి' ప్రదర్శిస్తోంటే, సీనియర్లు గుస్సా అవుతున్నారు. 'మాట తూలారంతే, రాజకీయాల్లో ఇవన్నీ కామన్‌..' అని కొందరు చినబాబుని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంటే, చాలామంది చినబాబు పార్టీ పరువు తీసేస్తున్నారనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క, మంత్రి అయ్యాక లోకేష్‌ పూర్తిగా పార్టీ వ్యవహారాల్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముందస్తుగానే ప్లాన్‌ చేసుకుని, ఎమ్మెల్సీగానో, ఎమ్మెల్యేగానో గతంలోనే అవకాశం కల్పించి, ప్రజా ప్రతినిథిగా కొంత అనుభవం వచ్చాక మంత్రిగా చంద్రబాబు, లోకేష్‌కి ఛాన్స్‌ ఇచ్చి వుంటే బావుండేదన్న అభిప్రాయాలు చంద్రబాబు దృష్టికి కూడా వెళుతున్నాయట. కానీ, జరగాల్సిన 'ఘోరం' జరిగిపోయింది. చినబాబు 'తప్పుల్ని' కవర్‌ చేసుకోవడం తప్ప చంద్రబాబు అయినా, టీడీపీకి చెందిన ఇతర నేతలైనా చెయ్యగలిగిందేమీ లేదు. ఓవరాల్‌గా చినబాబు, టీడీపీకి ఇప్పుడు సూపర్‌ మైనస్‌గా మారిపోయారన్నమాట.