Advertisement


Home > Politics - Gossip
ఇది స్కూళ్లలో జరిగే మాక్ అసెంబ్లీనా?

చంద్రబాబునాయుడు ఇప్పుడు హెడ్మాస్టరు పాత్ర పోషిస్తున్నారు. బహుశా మరో పదిరోజులు పాటు ఆయన ఇలాంటి హెడ్మాస్టరు పాత్రలోనే ఉంటారు. అవును మరి ... ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో అక్కడంతా స్కూలు పిల్లలు, హెడ్మాస్టరు వాతావరణంలాగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారి మీద అనర్హత వేటు వేయనందుకు నిరసనగా ఈ సమావేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ బహిష్కరించింది. ప్రతిపక్షం లేని సభను నడపడం అనే పరువునష్టం సంగతిని ప్రపంచం గుర్తించకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చాలా రకాలుగా పాట్లు పడుతున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రతిపక్షం పాత్ర కూడా మనమే పోషించాలంటూ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ప్రజల సమస్యలను తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తావించాలని మంత్రుల్ని నిలదీయాలని చంద్రబాబునాయుడు చెప్పారు.

అసలు పార్టీ ఏదైనా సరే.. తమ నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను ప్రస్తావించడమే ఎమ్మెల్యేల పని కదా.. మరి ఇన్నాళ్లూ తెలుగుదేశం వాళ్లు ఆ కనీస పనిచేయకుండా ఎందుకున్నారు? వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే మాత్రమే వారికి ప్రజా సమస్యలు కనిపిస్తాయా ? లేకపోతే కనిపించవా? అనేది ఒక ప్రశ్న . అదే సమయంలో.. అసెంబ్లీ విషయంలో మరో కామెడీ కూడా నడుస్తోంది.

ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడగాలి. నిలదీయాలి.. పట్టిసీమ మీద మాట్లాడాలి.. అంటూ ఎవరెవరు ఏం చేయాలో అంతా చంద్రబాబునాయుడే చెప్తున్నారు. ఇదంతా చూస్తోంటే ప్రజలకు ఓ సంగతి గుర్తొస్తోంది.

స్కూళ్లలో పిల్లలకు అసెంబ్లీ జరిగే తీరుపై అవగాహన్ కోసం మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. అక్కడ హెడ్మాస్టరు కొందరు పిల్లల గ్రూపును పాలక పార్టీగా, కొందరు పిల్లలను ప్రతిపక్షంగా తనే డిసైడ్ చేసి.. ఎవరు ఏం ప్రశ్నలడగాలో.. ఎవరు ఏం చెప్పాలో అంతా తనే డైరక్ట్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ కూడా స్కూళ్లలో జరిగే మాక్ అసెంబ్లీ లాగానే ఉన్నదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.