Home > Politics - Gossip
మళ్ళీ ముద్రగడ గడ...!

కాపు ఉద్యమనేత ముద్రగడ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ముద్రగడ ఈసారి అమరావతికి ఛలో పాదయాత్రకు పిలుపునివ్వడంతో ప్రభుత్వానికి శిరోభారంగా మారింది. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతామని, రిజర్వేషన్ల కోసం సాగించే తమ పోరాటంలో ఇదే చివరి యుద్ధమని ముద్రగడ ప్రకటించారు.

దీంతో ప్రభుత్వం ప్రతివ్యూహ రచనలో ఉంది. ముద్రగడ పాదయాత్రకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ముద్రగడ పాదయాత్రకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతి కోరే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. దీనిపై హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పాదయాత్రకు అనుమతి కోరితే పరిశీలిస్తాం తప్ప, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే తగుచర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదే అంశంపై ముద్రగడ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్రలకు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు వర్తించని నిబంధనలు తనకెలా వర్తిస్తాయో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు ఓ నీతి, నాకో నీతా? అని ప్రశ్నిస్తున్నారు.