Advertisement


Home > Politics - Gossip
మోడీ వంచన సోమూ మాటల్లోనే తెలుస్తోంది!

భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు.. కాంగ్రెస్ ను మించిన వ్యక్తి పూజ నడుస్తున్నదనే సంగతి అందరూ గుర్తిస్తున్నదే. నరేంద్రమోడీని భజన చేస్తూ ఉంటే చాలు.. తమ జీవితాలు పావనం అయిపోతాయన్నట్లుగా.. భాజపా నాయకులు అందరూ ప్రవర్తిస్తుంటారు. అయితే నాయకుడిని కీర్తించే హడావుడిలో వారు కొన్ని ‘అసలు సత్యాలను’ కూడా బయటపెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాల్లో గమనిస్తే.. భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు శాసనమండలిలో చేసిన ప్రసంగాన్ని మరో కోణంలో గమనిస్తే గనుక.. అసలు మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన వంచన ఏమిటో తెలిసిపోయేలా ఉంది.

వివరాల్లోకి వెళితే.. పోలవరం పనులు దాదాపుగా స్తంభించిపోయిన నేపథ్యంలో.. తమ పరువు కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. దీనిమీద ప్రజలు అసలు వాస్తవాలను గుర్తించడానికి ముందే ఏదో రకంగా మాయచేసి మభ్యపుచ్చడానికి అవస్థలు పడుతోంది. చంద్రబాబునాయుడు శాసనసభలో మొన్న పోలవరానికి సంబంధించి.. ఉన్నవీ లేనివీ చెప్పేసి.. నిధులు అంతా అనుకున్నట్లుగా విడుదల అయితే.. అనుకున్న గడువులోగా పూర్తి చేస్తాం.. అంటూ.. అక్కడితో దాని గురించి తన బాధ్యతను దులిపేసుకున్నారు. తాజాగా శాసనమండలిలో దేవినేని ఉమా పోలవరం గురించి.. చర్చలో పునరావాసం గురించి చాలా మాటలు చెప్పారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మండలిలో పోలవరం చర్చను తాము వాడుకోవడానికి భాజపా ఎమ్మెల్సీలు ప్రయత్నించడం విశేషం. సోము వీర్రాజు... ఇదే అదనుగా మోడీ భజన ప్రారంభించారు. మోడీ సర్కారు వచ్చిన వెంటనే.. తొలి కేబినెట్ భేటీలోనే పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపేసిందని.. ఆ గ్రామాలు గనుక రాకపోతే.. అసలు ప్రాజెక్టు జరిగేదేనా అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయినా ఇందులో మోడీ సర్కారు చేసిందేముందో అర్థం కావడం లేదు. ముంపు గ్రామాల విలీనంపై మన్మోహన్ ప్రభుత్వమే కేబినెట్ ఆమోదం చేసేసింది.

మోడీ ప్రభుత్వం చేయకపోతే.. చట్ట ఉల్లంఘన అయ్యేది. నేరం అయ్యేది. కొత్తగా వారు చేసిందేమీ లేదని ప్రజలందరికీ తెలుసు. కానీ.. సోము వీర్రాజు ఇలాంటి భజన చేయడం వలన.. భారతీయ జనతా పార్టీ ముంపు గ్రామాల విలీనం మినహా.. పోలవరం కోసం ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్థాయిలో మరేమీ చేయలేదనే సంగతి మాత్రం తేలిపోతోంది. సోము వీర్రాజు మాటలను గమనించినా.. మోడీ పాల్పడిన వంచన స్పష్టం అవుతోందని.. ప్రజలే వ్యాఖ్యానిస్తున్నారు.