Advertisement


Home > Politics - Gossip
మోడీ 'వాడకం' ఇలా వుంటుంది.!

ప్రధాని నరేంద్రమోడీ 'వాడకం' అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో వుంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. పబ్లిసిటీ స్టంట్లు ఏ స్థాయిలో చేయొచ్చో తనకు తప్ప ఇంకెవరికీ తెలియదన్నట్లుగా మోడీ వ్యవహరిస్తుంటారు. ఈ విషయంలో ఆయనకు సాటి ఇంకెవరూ రారేమో.! 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ, పాకిస్తాన్‌ని కూడా వాడేసుకున్నారు నరేంద్రమోడీ. తన ప్రసంగాల్లో కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించేందుకు 'పాకిస్తాన్‌'ని ఎడా పెడా వాడేసుకున్నారాయన. పాకిస్తాన్‌తో కలిసి కాంగ్రెస్‌ కుట్ర పన్నిందంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యల్ని నరేంద్రమోడీ చేయడం, దేశమంతా మోడీ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోవడం తెల్సిన విషయాలే. 

ఇక, అసలు విషయానికొస్తే నరేంద్రమోడీ, సీ ప్లేన్‌లో ప్రయాణించారు. దేశంలోనే తొలి సీ ప్లేన్‌ ప్రయాణమిది. అహ్మదాబాద్‌లోని సబర్మతి నుంచి ధరోయ్‌ వెళ్ళి అంబామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోకి ఈ మధ్యనే ఈ సీ ప్లేన్‌ ప్రవేశించింది. ఇంకా పూర్తిస్థాయిలో ప్రయోగ పరీక్షలు నిర్వహించాల్సి వుంది. ఆ పరీక్షల అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులను నడపాలని పౌర విమానయాన శాఖ భావిస్తోన్న విషయం విదితమే. 

భద్రతా కారణాల రీత్యా రోడ్‌ షోకి అనుమతి లభించకపోవడంతో (ఇది కాస్త ఆశ్చర్యకరంగానే వుంది కదూ.!) మోడీ, అప్పటికప్పుడు సీ ప్లేన్‌ వినియోగంపై నిర్ణయం తీసుకున్నారట. ప్రధాని నిర్ణయాన్ని ఎవరు మాత్రం కాదనగలరు.? అందుకే, క్షణాల్లో సీ ప్లేన్‌ ఆయన ముందు వచ్చి వాలిపోయింది. ఇప్పుడీ సీ ప్లేన్‌ వాడకంతో మోడీ ఓ రేంజ్‌లో వార్తల్లోకెక్కేశారు. పబ్లిసిటీ అంటే ఇదే మరి.! 

అయినా, ప్రధాని నరేంద్రమోడీ రోడ్‌ షోకి భద్రతా కారణాల రీత్యా అనుమతి లభించకపోవడమేంటట.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.