Advertisement


Home > Politics - Gossip
పాపం టీడీపీ.. వేణుమాధవ్‌నూ వాడేస్తోంది!

మొత్తానికి నంద్యాల్లో టీడీపీ తన తురుపుముక్కలన్నింటినీ వాడేస్తోంది. ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అరవై డెబ్బై మంది నేతలు, వారి అనుచరులు నంద్యాల్లో సందు సందు తిరుగుతూ.. రెండు నెలల నుంచి హడావుడి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి టీడీపీ నేతలు నంద్యాల్లో వాలిపోయారు. ఇక ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు కూడా నంద్యాల్లోనే అగుపిస్తున్నారు.

వీళ్లలో వచ్చే ఎన్నికల్లో ఎంతమంది తమ తమ సొంత నియోజకవర్గాల్లో గెలుస్తారో కానీ.. నంద్యాల్లో మాత్రం టీడీపీని గెలిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాల్ మనీ వ్యవహారాలతో, రౌడీయిజంతో వార్తలకు ఎక్కిన వారు కూడా శాంతివచనాలు చెబుతూ నంద్యాల్లో ఓట్లు అడుగుతుంటే... టీడీపీ గెలవడానికే వీళ్లందరినీ ఇక్కడ రంగంలోకి దించిందా? అనే సందేహం కలగకమానదు. మరి వారి సంగతలా ఉంటే.. నంద్యాల ఉప పోరు ప్రచారంలో టీడీపీ ఎవ్వరినీ వదలడం లేదు.

ఈ పరంపరలో వేణుమాధవ్ ను కూడా తెచ్చి ప్రచారం చేయించుకుంటోంది. నంద్యాల వంటి నియోజవకర్గంలో గెలవడానికి ఇంతటి సూపర్ స్టార్ ను తెచ్చుకుందంటే తెలుగుదేశం పార్టీ దయనీయ స్థితిని తెలియజెప్పడానికి వేరే రుజువు ఏమీ అవసరం లేదు. వేణుమాధవ్ సినిమాల్లో కనిపించడం దాదాపు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఆయనను టీడీపీనే అప్పుడప్పుడు ఆదరిస్తూ ఉంది.

ఆ మధ్య తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వేణుమాధవ్ టీడీపీ తరపున ప్రచారం చేశాడు. వాటి ఫలితాలు ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా వేణుమాధవ్ నంద్యాల్లో ప్రచారం చేస్తున్నాడు. జగన్ పై సెటైర్లు వేశాడు వేణుమాధవ్. అలాగే తను ప్రచారం కోసం రాలేదని, భూమా బ్రహ్మానికి ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయడానికే వచ్చానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి నంద్యాల ఫలితం ఎలా ఉంటుందో కానీ, వీళ్లందరి ప్రచారాన్ని చూస్తే మాత్రం... పాపం టీడీపీ అనిపించకమానదు!