Advertisement


Home > Politics - Gossip
నంద్యాల ఫైట్‌: చంద్రబాబు అసహనం

మొత్తంగా పార్టీ ముఖ్య నేతలంతా నంద్యాలలో మోహరించినా, తెలుగుదేశం పార్టీ ప్రచారం అంతంతమాత్రంగానే సాగుతుండడంపై పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనానికి గురవుతున్నారట. పలువురు మంత్రులు, పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు.. అంతా నంద్యాలలో మోహరించేశారు. అయినా ఏం లాభం.? ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా సంధిస్తున్న ప్రశ్నలకు ఒక్కరూ సమాధానం చెప్పలేకపోతున్నారాయె.! 

నడిరోడ్డుపై చంద్రబాబుని కాల్చిపారెయ్యాలన్నా, చంద్రబాబుని ఉరితీసినా తప్పు లేదన్నా.. జగన్‌ ఇంకేస్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్తున్నా, తూతూ మంత్రం ఎదురుదాడితో సరిపెడుతున్నారు తప్ప, 'పాయింట్‌ టు పాయింట్‌' కౌంటర్‌ ఇచ్చే పరిస్థితి టీడీపీ నేతలెవరిలోనూ కన్పించకపోవడం గమనార్హం. డ్వాక్రా రుణాల దగ్గర్నుంచి, రైతన్నల సమస్యల దాకా.. ఇలా ఒకటేమిటి.? అన్ని విషయాలపైనా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుని నిలదీస్తున్నారు వైఎస్‌ జగన్‌. 

'అది మేమిచ్చాం, ఇది ఇస్తున్నాం, ఇంకోటి ఇవ్వబోతున్నాం..' అని గట్టిగా చెప్పలేని దుస్థితి టీడీపీ నేతలది. 'మంత్రులున్నారు, ముఖ్యనేతలున్నారు.. ఏం లాభం.? మీ వల్ల పార్టీకి నంద్యాలలో అదనంగా ఒరిగిందేమీ లేదు..' అంటూ చంద్రబాబు తాజాగా, పార్టీ ముఖ్య నేతలకి, మంత్రులకి క్లాస్‌ తీసుకున్నారట.

మరోపక్క, నంద్యాల ఉప ఎన్నిను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి అఖిలప్రియ, తన తండ్రి 2014 ఎన్నికల్లో గెలిచిన సీటు కావడంతో, ఈసారి మళ్ళీ నంద్యాలను కైవసం చేసుకోలేకపోతే మంత్రి పదవి వదిలేసుకోవాల్సి వస్తందేమోనన్న ఆందోళనతో వున్నారు. ఇంటింటా ఆమె ప్రచారం నిర్వహిస్తున్నా, సరైన వాగ్ధాటి లేకపోవడం ఆమెకి పెద్ద లోపంగా మారింది. పైగా, అబ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సైతం నీరసంగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. 

మొత్తంగా చూస్తే, నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారం వన్‌ సైడెడ్‌గానే జరుగుతోంది ప్రస్తుతానికి. ప్రచారంలో ప్రతిపక్షం దూసుకుపోతోంది. అదే సమయంలో టీడీపీ నీరసించిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగితే అయినా, టీడీపీ ప్రచారంలో జోరు పెరుగుతుందా.? ఇంతకీ, చినబాబు నారా లోకేష్‌ ఎక్కడ.? బాలయ్యనైనా రంగంలోకి దించలేదేం.? పవన్‌కళ్యాణ్‌ సంగతేంటి.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.. వీటికి సమాధానాలెప్పుడు దొరుకుతాయోగానీ, ఈలోగా చంద్రబాబులో అసహనం మరింత పెరిగిపోతుందన్నది నిర్వివాదాంశం.