Home > Politics - Gossip
నంద్యాల ఫైట్‌: పవన్‌ని అలా వాడేస్తారా.?

నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి దూరంగా వుంటోంది. మరి, ఇంకో మిత్రపక్షం జనసేన మాటేమిటి.? పవన్‌కళ్యాణ్‌, నంద్యాల ఉప ఎన్నిక కోసం టీడీపీ తరఫున ప్రచారం చేస్తారా.? లేదా.? మంత్రి అఖిల ప్రియ, పవన్‌ కోసం చేస్తన్న ప్రయత్నాలు సఫలమవుతాయా.? లేదా.? టీడీపీ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈ ప్రశ్నల చుట్టూ.! 

'ఏం టెన్షన్‌ పడక్కర్లేదు.. రావడం లేటయినా, ఖచ్చితంగా వస్తారు.. బహిరంగ సభ ద్వారా పవన్‌, నంద్యాల ఓటర్లకు టీడీపీకి ఓటెయ్యమని విజ్ఞప్తి చేస్తారా.? వేరే మార్గాలేమైనా పవన్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్‌ చేశారా.? అన్నది ముందు ముందు తెలుస్తుంది..' అంటూ ఓ బలమైన నమ్మకం టీడీపీ శ్రేణుల్లో కన్పిస్తోంది. 

మొన్నామధ్య ఉద్దానం కిడ్నీ సమస్య పేరు చెప్పి, పవన్‌కళ్యాణ్‌ - చంద్రబాబుని కలవడం, పనిలో పనిగా మీడియా హడావిడి చేయడం తెల్సిన విషయాలే. బహిరంగ సభ, రోడ్‌ షో తరహాలో కాకుండా, నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి కాస్త కొత్తగా చంద్రబాబు ఆలోచన చేశారని తెలుస్తోంది. ఏదో ఒక అంశం పట్టుకుని పవన్‌కళ్యాణ్‌ని రప్పించి, టీడీపీకి అనుకూలంగా మాట్లాడించాలన్నది చంద్రబాబు వ్యూహమట. 

పవన్‌కళ్యాణ్‌ నంద్యాల ఉప ఎన్నికపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 'రెండు మూడు రోజుల్లో మాట్లాడతా..' అని ఆ మధ్య విజయవాడలో చెప్పిన పవన్‌కళ్యాణ్‌, మళ్ళీ ఆ తర్వాత మీడియాకి అందుబాటులో లేకుండా పోయారు. పవన్‌కళ్యాణ్‌ని, నంద్యాల ఉప ఎన్నిక కోసం టీడీపీ వాడుకోవడం నిజం.. అయితే ఆ వాడకం ఎలాగన్నదానిపైనే కొంత సందిగ్ధత నెలకొంది. అది కూడా కొద్ది రోజుల్లోనే తొలగిపోనుందట. చూద్దాం, చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రిపరేషన్‌ ఎలా వుందో.. పవన్‌కళ్యాణ్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌ ఎలా వుంటాయో.!