Advertisement


Home > Politics - Gossip
నంద్యాల ఎన్నికలు.. కుటుంబాల్లో రాజకీయ చిచ్చు!

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌ భూమా కుటుంబానికి దక్కడం ఖాయమైంది. భూమా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో సానుభూతిని క్యాష్‌ చేసుకోవడానికి చంద్రబాబు ఆ కుటుంబానికే టికెట్‌ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని శిల్పా మోహన్‌రెడ్డికి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఆశలపై బాబు ఆ విధంగా నీళ్లు చల్లాడు.

ఆ సంగతలా ఉంటే.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతల మధ్యనే కాదు పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న కుటుంబాల మధ్యన కూడా చిచ్చురేగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భూమా కుటుంబంలో విబేధాలు జనించాయి. టికెట్‌ విషయంలో భూమా తనయలు, భూమా అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిల మధ్య పోటీ ఉందని తెలుస్తోంది. గతంలో తన తండ్రి మరణించినప్పుడు రాజకీయ వారసత్వాన్ని భూమా నాగిరెడ్డికి వదిలిపెట్టామని, ఇప్పుడు అవకాశం తనకు కావాలని బ్రహ్మానందరెడ్డి కోరుతున్నాడట.

ఆల్రెడీ భూమా పెద్ద తనయ అఖిలప్రియ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంది కాబట్టి.. అవకాశం తనకు కావాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం. అయితే భూమా చిన్న తనయ ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అన్నయ్యకు అవకాశం ఇచ్చేలా లేరు చెల్లెల్లు.

మరి టికెట్‌ విషయంలో వీరిగొడవ ఎంత వరకూ వెళ్లాలో చూడాల్సి ఉంది. అదలా ఉంటే.. ఇటు శిల్పా ఫ్యామిలీలో కూడా చిచ్చు రేగినట్టు సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి అన్న మోహన్‌ రెడ్డితో విబేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. టికెట్‌ దొరకలేదు కాబట్టి.. పార్టీ వీడాలనేది మోహన్‌రెడ్డి ఆలోచన కాగా, చక్రపాణి రెడ్డి మాత్రం అందుకు సుముఖంగా లేడట. పార్టీలోనే ఉండి, నంద్యాలలో తను చెప్పిన వారిని గెలిపిస్తే.. మండలి చైర్మన్‌ పదవిని చక్రపాణిరెడ్డికి ఆఫర్‌ చేశాడట బాబు. దీంతో ఆయన ఆ మత్తులో పడిపోయాడు. ఇప్పుడు అన్నను వ్యతిరేకించడానికి కూడా రెడీ అయ్యాడట. బాబు ఎవరికి చెబితే వారి కోసం పని చేస్తానన్నాడట. ఈ విధంగా బాబు వ్యూహాత్మకంగా శిల్పా కుటుంబంలో చిచ్చు పెట్టేశాడు.

అటు భూమా వారసులు, ఇటు శిల్పా సోదరులు.. తమ తమ వ్యక్తిగత ప్రాపకాల కోసం ఒకరితో ఒకరు గట్టిగానే విబేధించుకుంటున్నారు. మరి వీళ్ల గొడవలు ఎక్కడి వరకూ వెళతాయో చూడాలి!