Home > Politics - Gossip
నన్ను చంపేస్తారేమో!

ఈ మాటలు అన్నది ఓ సాదా సీదా వ్యక్తి కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలో శాసనసభా పక్ష నాయకునిగా వ్యవహరిస్తున్న విష్ణుకుమార్‌రాజు నోట వచ్చినవి.

సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల పై చిలుకు విలువ చేసే జిల్లాలోని ముదపాక భూముల భోగోతాన్ని బయటపెట్టినందుకు తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని రాజు గారు వాపోయారు.

వారి నోటి దగ్గర కూడును లాగేసుకున్నందుకు ఆక్కసుతో ఎంతకైనా తెగించే అవకాశం ఉందని కూడా ఆయన ఆందోళన చెందారు. మిత్రపక్షమైనా కూడా తెలుగుదేశం పార్టీ చేసే తప్పులను చూస్తూ ఊరుకోనని, ప్రజల ప్రతినిధిగా వారి సమస్యలను ప్రస్తావించకపోవడం నేరమని, గమ్మున కూర్చోవడానికి ఎమ్మెల్యే పదవి ఎందుకని కూడా రాజు ప్రశ్నించారు.

తాను వ్యాపారాలను సైతం మానుకుని ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వచ్చానని, అక్రమాలను, అన్యాయాలను సహించే ప్రసక్తే లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను వత్తిడి చేయడం వల్లనే ముదపాక వ్యవహారం ఆగిపోయిందని, జిల్లాకు రెవిన్యూ మంత్రి వచ్చి విచారణ చేపడుతున్నారని ఆయన అన్నారు.

ల్యాండ్‌ పూలింగ్‌పై తాను చేసే పోరాటానికి బీజేపీలో సమర్ధించే వారూ లేరూ, వ్యతిరేకించే వారూ లేరని రాజు చెప్పడం విశేషం. ఏపీ అధ్యక్షునిగా, విశాఖ ఎంపీగా ఉన్న హరిబాబు ఈ వ్యవహారంపై ఇంతవరకూ పెద్దగా స్పందించకపోవడంతో రాజు ఒంటరిని అయ్యాయన్న భావనలో ఉన్నారు.

ఏది ఏమైనా తన రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని భారాన్ని చంద్రబాబుపైనే వేశారు. నవ నిర్మాణ దీక్షలలో అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రతిన చేసిన రోజునే జిల్లాలోని ఆనందపురంలో తహసీల్దారు సస్పెండ్‌ అయ్యారని, వ్యవస్ధలోని లోపాలను సరిచేయకుండా అవినీతిపై ప్రకటనలు చేస్తే సరిపోదని పరోక్షంగా బాబు సర్కార్‌పైనా ఆయన విమర్శలు సంధించారు.