Advertisement


Home > Politics - Gossip
నారా 'మెలిక': సీఎంకే రక్షణ లేకపోతే..

'ఇలాంటి వ్యక్తిని నడిరోడ్డు మీద కాల్చేసినా తప్పు లేదు..' 

'ఇలాంటి వ్యక్తిని ఉరితీసినా తప్పు లేదు..' 

- నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. 

రాజకీయాలన్నాక ఆరోపణలు సహజమే. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని పట్టుకుని, అసెంబ్లీలో 'దొంగా.. దొంగా..' అని పదే పదే విమర్శించినా అది తప్పు కాదు. కానీ, ప్రతిపక్ష నేత - ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే మాత్రం తప్పు. అందుకే మరి, 'తాను చేస్తే సంసారం.. ఇంకెవడన్నా చేస్తే డాష్‌ డాష్‌ అన్నాడట వెనకటికి ఒకడు' అన్న మాటని పెద్దలు ఎప్పుడో చెప్పింది. 

'నడిరోడ్డు మీద కాల్చేసినా.. ఉరితీసినా తప్పు లేదు..' అన్న మాటలు మాట్లాడేముందు వైఎస్‌ జగన్‌, ఖచ్చితమైన నేపథ్యాన్ని కూడా ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్నీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిన వైనాన్నీ వైఎస్‌ జగన్‌ ప్రస్తావిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు.. ఇలా చాలా అంశాల్ని జగన్‌ ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు గుస్సా అవుతూ, 'ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే..' అంటూ ఈ రోజు మీడియా ముందు మొసలి కన్నీరు కార్చేశారు. 

ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు, వ్యవస్థ.. అని సెలవిచ్చారు చంద్రబాబు. మరి, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల సంగతేంటి.? మాట తప్పిన ముఖ్యమంత్రి గురించి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. అలా ఇచ్చిన మాట తాను తప్పలేదని చంద్రబాబు చెప్పగలిగితే, వైఎస్‌ జగన్‌ మాట్లాడింది నూటికి నూరుపాళ్ళూ తప్పే అవుతుంది. 

ప్రత్యేక హోదా సంజీవని అన్న నోటితోనే, అదేమీ సంజీవని కాదని చంద్రబాబే సెలవిచ్చారు. జిల్లాకో కొత్త ఎయిర్‌పోర్ట్‌ అన్నారు, కర్నూలు జిల్లాకి ఎయిర్‌పోర్ట్‌ ఏది? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే చంద్రబాబుకి కోపమొచ్చేసింది. సీఎం అంటే ఓ వ్యవస్థ. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

కానీ, ఆ సీఎం పదవిలో వున్న వ్యక్తి ప్రజల్ని మభ్యపెడితే, మోసం చేస్తే ఏమనాలి.? సీఎం పదవి కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, పదవిలోకి వచ్చాక హామీల్ని మరచినప్పుడు ఎలా జనం నిలదీయాలి.? ముఖ్యమంత్రి ఓ వ్యస్థ.. అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ వ్యవస్థకి అధిపతిగా వుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నట్టు.!