Advertisement


Home > Politics - Gossip
నరేంద్రమోడీ టెన్షన్‌కి కారణం అదేనా.?

ఈక్వేషన్స్‌ మారుతున్నాయి.. సొంత రాష్ట్రం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రధాని నరేంద్రమోడీ గెలిపించలేరా.? ఆ దిశగానే ఎన్నికల ఫలితాలు వుండబోతున్నాయా.? రోజురోజుకీ మారుతున్న ఈక్వేషన్స్‌ కారణంగా వచ్చిన టెన్షన్‌తోనే నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఇంతకు ముందెన్నడూ లేనంత సీరియస్‌గా తీసుకుంటున్నారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.. అన్నిటికీ ఒకటే సమాధానం అవునని.! 

ఎన్నికలకు ముందు ఈక్వేషన్స్‌ సంగతెలా వున్నా, గెలుపు తమదేనని భారతీయ జనతా పార్టీ తెగేసి చెబుతోంది. గడచిన కొంతకాలంగా గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీనే అధికారం వెలగబెడ్తోంది. బీజేపీకి ఆ స్థాయిలో అక్కడ బలమైన ఓటు బ్యాంకుని నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వున్న టైమ్‌లో సాధించిపెట్టారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 

ప్రభుత్వ వ్యతిరేకతకి తోడు, గడచిన మూడున్నరేళ్ళలో దేశంలో మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాలు గుజరాత్‌ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయట. అన్నిటికీ మించి, పెద్ద నోట్ల రద్దు - జీఎస్‌టీ గుజరాత్‌ ఎన్నికల్లో చూపే ప్రభావం అంతా ఇంతా కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాదిగా పలు సర్వేలు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలుగు చూస్తున్నాయి. మొదట్లో బంపర్‌ మెజార్టీ బీజేపీకేనని తేల్చిన సర్వేలు, క్రమక్రమంగా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. ఇప్పటికీ సర్వేల్లో కాంగ్రెస్‌ పార్టీకి 'ఎడ్జ్‌' కన్పించకపోయినా, బీజేపీ ఇమేజ్‌ దారుణంగా తగ్గిపోయిందనే సంకేతాలు కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. 

తాజా సర్వేల ప్రకారం ఓటింగ్‌ శాతం పరంగా చూస్తే బీజేపీ - కాంగ్రెస్‌కి మధ్య పెద్దగా తేడా వుండకపోవచ్చునట. సీట్ల విషయంలో మాత్రం ఐదు నుంచి పది వరకు తేడా వుంటుందనీ, అదీ బీజేపీకే అనుకూలమన్నది తాజా సర్వేల సారాంశం. గోవా తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసిందో చూశాం. సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచినా, అధికారం దక్కించుకుంది ఆయా రాష్ట్రాల్లో. ఆ లెక్కన చూస్తే ఐదు సీట్లు కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి అదనంగా వస్తే సరిపోతుంది. 

కానీ, ఇదంతా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సర్వేలు వెల్లడిస్తున్న విషయాలే కాబట్టి, ఎన్నికల నాటికి పరిస్థితులెలా మారిపోతాయోనన్న ఆందోళన బీజేపీలో వ్యక్తమవుతోంది. అందుకే, మోడీ ఇంతకు ముందెన్నడూ లేనంత 'కంగారుగా' కన్పిస్తున్నారు. బీజేపీ సంగతి సరే, కాంగ్రెస్‌ మాటేమిటి.? బీజేపీ కంటే ఒకటో రెండో సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే కుదరదు, క్లియర్‌ మెజార్టీ దక్కాలి. లేదంటే.. గోవాలో ఏమయ్యిందో చూశాం కదా.! అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లుంది కాంగ్రెస్‌ పరిస్థితి.