Home > Politics - Gossip
నేనే ముఖ్యమంత్రినైతే...

టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు చాలానే వున్నాయి. తెలంగాణ టీడీపీ నుంచి సీనియర్లంతా 'ఔట్‌' అయిపోవడంతో, ప్రస్తుతానికి రేవంత్‌రెడ్డిదే హంగామా అంతా. ఓటుకు నోటు కేసు దెబ్బతో చంద్రబాబూ, రేవంత్‌రెడ్డి ఆడించినట్లు ఆడక తప్పదు. ఎందుకంటే, ఈ కేసులో 'బ్రీఫింగ్‌' అంతా చంద్రబాబుదే కదా.! ప్రధాన నిందితుడే అయినా, రేవంత్‌రెడ్డి అప్రూవర్‌ అయితే చంద్రబాబు సీన్‌ సితార్‌ అయిపోతుంది. 

పొద్దున్న లేస్తే నీతుల గురించీ, చిత్తశుద్ధి గురించీ మాట్లాడే నిప్పు నారా చంద్రబాబునాయుడు, ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చి 'గౌరవించారు'. ఈ గౌరవించడం వెనుక అర్థం వేరే. తన పేరు బయటకు రాకుండా, అలా అలా మేనేజ్‌ చేశారన్నది ఆ 'గౌరవించడం' తాలూకు అర్థం. 

ఇక, రేవంత్‌రెడ్డి విషయానికొస్తే, 'నేనే ముఖ్యమంత్రినైతే..' అంటూ అప్పుడే ఎన్నికల హామీలు గుప్పించేస్తున్నారాయన. ఇది మరీ పెద్ద కామెడీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలు. అందులో ఆర్‌.కృష్ణయ్య టీడీపీలో వున్నారో లేదో ఆయనకే తెలియదు. అంటే, మూడు మైనస్‌ ఒకటి అన్నమాట. దానర్థం ఇద్దరు ఎమ్మెల్యేలే టీడీపీలో వున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఓటుకు నోటు కేసులో 1వ నిందితుడు కాగా మరొకరు రెండో నిందితుడు. ఈక్వేషన్‌ అదిరింది కదూ.! 

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలని, ఇతర ముఖ్య నేతల్నీ లాగేసిన టీఆర్‌ఎస్‌, కింది స్థాయి క్యాడర్‌ని కూడా తనవైపుకి బలంగానే తిప్పుకుంది. దానికి నిదర్శనం, తెలంగాణలో ఇటీవల జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారడమే. గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనూ టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారిపోయింది. 

ఈ పరిస్థితుల్లో 'నేనే ముఖ్యమంత్రినైతే..' అంటూ రేవంత్‌రెడ్డి చెప్పడం ఎంతవరకు సబబు.? ఆశ వుండాలి, కానీ దానికీ ఓ హద్దు వుంటుంది. 'టీడీపీ - బీజేపీ మిత్రపక్షాలు.. ఆ లెక్కన.. వేసుకున్న చొక్కాకి రెండు జేబులన్నమాట.. ఏ జేబులో వున్నా అది మనదే కదా..' అంటూ బీజేపీలోకి జంపింగ్‌ ఊహాగానాలపై మరింత గందరగోళాన్ని పెంచేశారు రేవంత్‌రెడ్డి. 

ఒకవేళ అన్నీ కలిసొచ్చి, ఏమో గుర్రం ఎగరావచ్చు.. అనేలా పరిస్థితులు మారిపోయి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమొచ్చినా, చివరి నిమిషంలో 'ఓటుకు నోటు కేసు' ఆయన్ని వెక్కిరిస్తేనో.? తమిళనాడులో శశికళ పరిస్థితి ఏమయ్యింది.?