Home > Politics - Gossip
ఆనందలహరి.. బాబుగారి కొత్త వినోదం!

ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇప్పుడు బాబుగారి కాన్సన్‌ట్రేషన్ అంత దీని మీదే. రాజధాని సినిమా సెట్టింగులా ఉండాలని అంటారు. పండగలకు కానుకలు ఇస్తున్నారు. పుష్కరాలు, పండగలు వస్తే.. ఇక ఫుల్ వినోదాల, విన్యాసాలు. ఇక జలహారతులు, పండగ సంబరాలు సరేసరి. ఇవన్నీ కాదని.. హ్యాపీ సండేస్.. అని ఒక కార్యక్రమం నడుస్తోంది.

స్కూల్ పిల్లలను, అంగన్ వాడీ కార్యకర్తలను, ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను. .గట్రా ఏ స్కూల్ కాంపౌండ్లోనో చేర్చి.. సండే రోజున.. వారందరి చేత విధిగా ఆటలు ఆడించడం, పాటలు పాడించడం.. ఈ హ్యాపీ సండే మోటో. దీని కోసం ప్రభుత్వ ఖజనా నుంచి కోట్ల రూపాయలను హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. అదేమంటే.. ఆ ఆటపాటలతో పిల్లలకు, టీచర్లకు వినోదం అంట. మరి ఎంటర్ టైన్ మెంట్ అంటే... ఒక్కోడికి ఒక్కోటి ఇష్టం ఉంటుంది.

అయితే.. బాబుగారి జమానాలో.. ఆటపాటలు కూడా విధిగా మారాయి. వాటి కోసం ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ హ్యాపీ సండేస్ సంగతిలా ఉంటే.. ఇప్పుడు మున్సిపాలిటీ లెవల్లో కొత్త ప్రోగ్రామ్ అట. దాని పేరు ‘ఆనంద లహరి’. ఇది కూడా జనాల ఎమ్యూస్‌మెంట్ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమేనని వార్తలు వస్తున్నాయి. కళా, సంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేస్తూ..జనాలను రంజింప జేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అని సమాచారం. ఈ విధంగా సాగుతోంది వ్యవహారం.

ప్రతి మున్సిపాలిటీ స్థాయి పట్టణంలోనూ ఈ ఆనందలహరి సాగుతుందట. భలే ఉంది కదా.. ఆకలితో అలమటిస్తున్న వాళ్లు అలమటించని, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఎటైనా పోనీ, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ వెతలు, పేదల బాధలు.. వీటి సంగతెలా ఉండనీ, ఇలాంటి వినోదాలు మాత్రం తక్షణ అవసరం. వీటితో కొంతమంది ఎంటర్ టైన్ చేస్తే.. ప్రభుత్వ బాధ్యత పూర్తి అవుతుంది. జనాలంతా ఆనందంగా ఉన్నారు. సంతోషంతో తుళ్లుతూ గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. చాలు కదా!