Advertisement


Home > Politics - Gossip
తెదేపా పలాయనవాదంలో ఇదొక కొత్త స్టయిల్!

ఏదో జనాంతికంగా సవాళ్లు విసురుకోవడం.. మాదగ్గర ఆధారాలున్నాయ్... నిరూపించేస్తాం అంటూ ప్రగల్భాలు పలకడం, తమ మీదే ఆరోపణలు వస్తే గనుక.. నిరూపించండి రాజీనామా చేస్తా అంటూ పోచికోలు కబుర్లు చెప్పడం.. తీరా సవాళ్లు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యేసరికి గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోవడం సాధారణంగా రాజకీయ నాయకులు పలాయనమంత్రం పఠించే శైలి.

పార్టీలతో నిమిత్తం లేకుండా.. ప్రతి ఒక్కరూ కూడా తమ మీద ఆరోపణలు వస్తే, నిరూపిస్తే రాజీనామా చేసేస్తా లాంటి ఆర్భాటపు మాటలే చెబుతుంటారు. ఆ తర్వాత జావగారిపోతుంటారు. అయితే తాజాగా అమరావతి వేదికగా.. వైసీపీ- తెలుగుదేశం నాయకుల మధ్య జరిగిన సవాళ్లు- ప్రతిసవాళ్ల పర్వంలో.. తెదేపా నాయకులు ఈ పలాయనవాదానికి కొత్త స్టయిల్ పరిచయం చేశారు. ఎటూ అధికారం తమ చేతిలోనే ఉంది గనుక.. దాన్ని అడ్డు పెట్టుకుని కొత్త డ్రామాకు తెర తీస్తున్నారు.

రెండు రోజుల కిందట సత్తెనపల్లి ఎమ్మెల్యే వైసీపీకి చెందిన అంబటి రాంబాబుకి, విజయవాడలోని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకి మధ్య మాటలయుద్ధం జరిగింది. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో వారిద్దరూ వాదులాడుకున్నారు. రాష్ట్రంలో అసలు వృద్ధాప్య పెన్షన్ల అమలు సక్రమంగా లేదని అంబటి ఆరోపిస్తే.. వెంకన్న దానిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. దమ్ముంటే ఒక్క కేసు చూపించు.. ఏదో విమర్శలు చేసేయడం కాదు.. అంటూ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు.

దానికి అంబటి కూడా తగ్గలేదు. తన సత్తెనపల్లి నియోజకవర్గానికి వస్తే.. బోలెడు ఉదాహరణలు చూపిస్తా అన్నారు. ఆ సవాలును స్వీకరించిన వెంకన్న సోమవారం సాయంత్రం సత్తెనపల్లి బస్టాండు వద్దకు వచ్చేలా రెట్టించి పంతంకాశారు.

అయితే సత్తెనపల్లి దాకా వెళితే.. పరువుపోతుందని అధికార పార్టీ వారికి భయం పుట్టిందేమో.. తాముగా వెనక్కు తగ్గినట్లుగా కనిపించకుండానే.. పరువు పోయే ప్రమాదం రాకుండా కొత్త స్కెచ్ వేశారు. ఇద్దరు నాయకులు సత్తెనపల్లిలో కలవడం జరిగితే.. అల్లర్లు రేగుతాయనే అనుమానంతో పోలీసుల ద్వారా సాంతం ఆపించేశారు. వెంకన్నను విజయవాడలోనే నిలువరించిన పోలీసులు, అంబటి రాంబాబును గుంటూరులో గృహనిర్బంధం చేశారు.

తాముగా సవాళ్లు విసురుకుని వాటిని నిరూపించుకోవడానికి పోలీసులు ద్వారా చక్రంతిప్పించారని ప్రజలు ఈసడించుకుంటున్నారు. అధికారం తమ చేతిలో ఉండేసరికి తాము పారిపోవాల్సి వచ్చినప్పుడెల్లా.. పోరాటానికే చెక్ పెట్టించేసేలా.. తెదేపా వక్రనీతిని అనుసరిస్తోందని పలువురు అంటున్నారు.