Advertisement


Home > Politics - Gossip
నిజ్జంగా నిజమిది: ఇవి పబ్లిసిటీ ప్రాజెక్టులు.!

మొన్న పట్టిసీమ, ఇప్పుడు పురుషోత్తపట్నం.. రేప్పొద్దున్న ఇంకోటి. ఇంతకీ పోలవరం ప్రాజెక్టు ఏమయ్యిందట.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. కేంద్రం నిధులు ఇవ్వదాయె.. రాష్ట్రమేమో, ఆ ఖర్చు భరించలేకపోతోందాయె.! అయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్‌కి ఢోకా ఏమీ లేదు. ఇటు పోలవరంతో, అటు పట్టిసీమ - పురుషోత్తపట్నంతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నారు.! 

చంద్రబాబు మాత్రమే కాదు, చంద్రశేఖర్‌రావు చేస్తున్నది కూడా అదే.. ఆ పబ్లిసిటీ స్టంటే.! జనాన్ని పోగెయ్యడం, బహిరంగ సభలు నిర్వహించడం, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. ఇదీ తెలంగాణలో జరుగుతున్న తంతు. తేడా ఏముందట.? అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో, ఇక్కడ తెలంగాణలోనూ అదే జరుగుతోంది. విభజనతో జరిగిన నష్టమంటూ చంద్రబాబు ఏకరువు పెడ్తోంటే, 'గత పాలకులు' అంటూ చంద్రశేఖర్‌రావు దుమ్మెత్తిపోస్తున్నారు. 

కర్నాటక, మహారాష్ట్ర - తెలుగు రాష్ట్రాలకు ఎగువన వున్న రాష్ట్రాలు. కృష్ణా నదిని కర్నాటక బంధించేస్తే, గోదావరికి మహారాష్ట్ర అడ్డుకట్ట వేసేసింది. చిత్రంగా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుమ్మెత్తి పోసెయ్యగలుగుతున్నారుగానీ, ఎగువ రాష్ట్రాల్ని మాటవరసకైనా ప్రశ్నించలేకపోతున్నారు. ఎగువ రాష్ట్రాల్ని ప్రశ్నించగలిగితే, కనీసం నీరు కాస్తయినా కిందికి దిగే పరిస్థితి వస్తుంది. ఆ మాత్రం విజ్ఞత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రదర్శించలేకపోతుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, కోట్లు ఖర్చు చేసి బహిరంగ సభలకి జనాన్ని రప్పించడం ద్వారా పొలిటికల్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేయడం మినహా.. ఈ తరహా ఎత్తి పోతల పథకాల ద్వారా సాధించేదేంటో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే తెలియాలి. ఎత్తి పోతల పథకాల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం, అసలు ప్రాజెక్టుల గురించి ఆలోచించకుండా, రావాల్సిన నీటి వాటాపై నిజాలు చెప్పకుండా.. పబ్లిసిటీ స్టంట్లు చేయడమే అత్యంత హాస్యాస్పదం.