Home > Politics - Gossip
ఔరా.. ఎంత బరితెగింపు.. ఎంత వరకూ ఇలా?

విరగాలంటే ఈ మాత్రం పెరగాలేమో… అవతల తెలుగుదేశం పార్టీ అనుకూల నెటిజన్లు ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నా, జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా, జగన్ వాళ్లింట్లో వాళ్లపై హద్దు మీరి మాట్లాడుతున్నా.. తమ అక్కసునంతా కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా వెళ్లగక్కుతున్నా ఆ చర్యలను వినోదంగా చూస్తోంది ప్రభుత్వం. ఎంత వరకో వద్దు.. తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ నుంచినే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎలాంటి చవాకులు పేలారో.. జగన్ విషయంలో ఎలాంటి అవాక్కులు పోస్టు చేశారో దాచి పెడితే దాగే విషయం ఏమీ కాదు.

అయితే తాను చేస్తే శృంగారం, ఎధుటి వాళ్లు చేస్తే వ్యభిచారం.. అనే మాటను తమ లక్షణంగా అలవరుచుకున్న వాళ్లు ప్రతి విషయంలోనూ ఇదే తరహాలోనే వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు.

తెలంగాణలో ఫిరాయింపులు జరిగితే అది సంతలో పశువుల చందం, ఏపీలో జరిగితే.. అది పాలనకు దక్కుతున్న బహుమానం. అలాంటి విషయాల్లోని రెండు కళ్ల సిద్ధాంతాన్నే ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులపై కూడా ఉపయోగించుకుంటున్నారు.

తను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని, ఎవరినీ కులం పేరుతో మతం పేరుతో తిట్టలేదు అని.. రవీంద్ర ఇప్పల అనే నెటిజన్ చెబుతున్నాడు. అతడి ఫేస్ బుక్ పేజీని చూసినా.. అభ్యంతర కర పదజాలం అగుపించదు. 

అవతల తెలంగాణలోనూ ప్రభుత్వం ఉంది. వాళ్లూ సోషల్ మీడియాను కట్టడి చేస్తామని అన్నారు. వారి వ్యవహారం మాటల తోనే ఆగిపోయింది. వెనుకటికి కాంగ్రెస్ హయాం లోనూ చిదంబరం ఇలానే మాట్లాడాడు. సోషల్ మీడియాను కట్టడి చేస్తామన్నట్టుగా మాట్లాడాడు. ఆ మాటల మీదే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ఆ తీరు ఇటాలియన్ పాసిజం అంటూ నాడు నెటిజన్లు ద్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్ వాళ్లు వెనక్కు తగ్గారు. 

సోనియా పైనా , రాహుల్ పైనా ఎలాంటి సెటైర్లు పోస్టు అయినా.. వాళ్లు సహించారు. అయితే ఆ మాత్రం సహనం నేటి తెలుగు దేశం పాలకుల్లో లేకుండా పోతోంది. సహనం చూపిన కాంగ్రెస్ వాళ్లే.. కట్టడి చేస్తామని మాట్లాడిన వాళ్లే.. అడ్రస్ లేకుండా పోయారు. మరి రాజ్యాంగం ప్రసాదించిన భావస్వేచ్ఛనే కాలరాస్తున్న వారికి ఎన్నికల్లో ఎలాంటి గతి పడుతుందో వేచి చూడాలి. అతిగా రియాక్ట్ అయిపోయి తెలుగుదేశం పార్టీ కోరి ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుకుంటోందేమో.